సాక్షి, అమరావతి: ఈ బడ్జెట్‌లో ఏపీ మీదుగా వెళ్లే కొత్త రైళ్ల కూతలేవీ వినిపించలేదు. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన రైల్వే జోన్‌కు నిధులూ కేటాయించలేదు. ఒక్క కొత్త రైల్వే ప్రాజెక్టు కూడా ఏపీకి దక్కలేదు. ఇప్పటికే విశాఖపట్టణం, తిరుపతి, గుంటూరు, శ్రీకాకుళం ప్రాంతాలకు ప్రైవేటు రైళ్లను నడిపేందుకు టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. ఈ తరహా రైళ్లను మరిన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం బడ్జెట్‌లో పేర్కొంది. ఈ బడ్జెట్‌లో రైల్వేలపరంగా ఏపీకి న్యాయం జరుగుతుందని ఆశిస్తే, తీరని అన్యాయమే జరిగిందని రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పీపీపీ విధానంలో రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులపై రెండుమూడు రోజుల్లో స్పష్టత వస్తుందని రైల్వేవర్గాలు చెబుతున్నాయి.
గతేడాది పెండింగ్ ప్రాజెక్టులకు రూ.2,442 కోట్ల కేటాయింపు
గతేడాది (2019 ఫిబ్రవరి) ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులకు రూ.2,442 కోట్లు కేటాయించారు. బడ్జెట్ ప్రసంగంలో కొత్త ప్రాజెక్టు ఏదీ ప్రకటించకున్నా.. ఈ నిధుల్ని ఆ తర్వాత కేటాయించారు. సాధారణంగా పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టాక దక్షిణ మధ్య రైల్వేకు ఎంత కేటాయించారన్న వివరాలపై రైల్వే బోర్డు సమాచారమిస్తుంది. ప్రతిసారీలానే ఈ దఫా బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండుమూడు రోజులకు కేటాయింపుల సమాచారాన్ని రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటిస్తారు.
ఈ ప్రకటనలో.. ఏపీలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికిగాను అన్ని ప్రాంతాలను కలిపేలా తేజస్ రైళ్లు, రైల్వే వ్యవస్థ ఆధునికీకరణలో భాగంగా ప్రధాన రైల్వేస్టేషన్ల అభివృద్ధికి సంబంధించి వివరాలపై సమాచారం అందుతుందని అధికారులు భావిస్తున్నారు. గతంలో ప్రకటించిన విశాఖ రైల్వేజోన్ పరిపుష్టికి సంబంధించి అంశాలుంటాయని రైల్వే అధికారులు యోచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment