
బాధితులతో మమేకం
తుపాను బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం జిల్లాలో, ఏజెన్సీలోనూ విసృ్తతంగా పర్యటించారు.
సాక్షి, విశాఖపట్నం : తుపాను బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం జిల్లాలో, ఏజెన్సీలోనూ విసృ్తతంగా పర్యటించారు. అనకాపల్లి, చోడవరం, పాడరు, హుకుంపేట, అరకులలో ఆయన తుపాను బాధితుల చెంతకు వెళ్లారు. అరకులో కొండ చరియలు విరిగిపడి మృతిచెందిన ఐదుగురి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారివద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
తమ కోసం వచ్చిన జగన్‌ను చూసి బాధితుల గుండెల్లో వారంరోజులుగా గూడుకట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. ఓ కొడుకుతోనో సోదరుడితోనో చెప్పుకున్నట్లుగా జగన్‌తో తమ బాధను పంచుకున్నారు. ఆయన కూడా అందరి బాధలు ఓపిగ్గా విని వారికి తానున్నానని సాంత్వన చేకూర్చారు. వారి తరపున ప్రభుత్వంతో పోరాడతానని హామీ ఇచ్చారు. అందరికీ మేలు జరిగేలా చూస్తానని భరోసా కల్పించారు.
సుగర్స్ అమ్మేస్తారేమోనని రైతుల భయం... : అడ్డుకుంటానని జగన్ భరోసా
తుమ్మపాల సుగర్స్... జిల్లాలో వేలాదిమంది రైతుల ఆశాదీపం... కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల ప్రస్తుతం మిణుకుమిణుకుమంటోంది. అందుకే చెరకు రైతులు జగన్ తమ వద్దకు రాగానే తమ బాధను వెళ్లబోసుకున్నారు. ‘చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు తుమ్మపాల సుగర్స్‌ను అమ్మేద్దామనుకున్నారు. అప్పుడు నాన్నగారే అడ్డుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన సీఎం అయ్యారు. మా సుగర్స్‌ను అమ్మేస్తారేమోనని భయంగా ఉంది. అందుకే రైతులకు బాకీలు చెల్లించడం లేదు. కంపెనీ నష్టాల్లో ఉందని చెబుతున్నారు.
ఫ్యాక్టరీ అమ్మేస్తే వేలాదిమంది రైతులం రోడ్డున పడతాం. అప్పుడు నాన్నగారు అడ్డుకున్నట్లు ఈసారి మీరే అడ్డుకోవాలి బాబు’అని రైతులు జగన్‌తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈమేరకు రైతులు కర్రి రాము, పిల్ల కొండయ్య, అప్పలనాయుడు, ఉమామహేష్ తదితరులు జగన్ వద్దకు వచ్చి తమ బాధను చెప్పుకున్నారు. వారందరి ఆవేదనను ఓపిగ్గా విన్న వై.ఎస్.జగన్ వారికి ధైర్యం చెప్పారు. ‘సహకార రంగంలో ఉన్న సుగర్ ఫ్యాక్టరీలను అమ్మేయడం చంద్రబాబుకు అలవాటే.
గతంలో సీఎంగా ఉన్నప్పుడు అదే చేశారు. తమ వాళ్లకు తక్కువ ధరకు కట్టబెట్టారు. ఈసారి అలానే చేయాలని చూస్తున్నారు. అందుకే సుగర్స్ నష్టాల్లో ఉందని చూపిస్తున్నారు. చంద్రబాబు ప్రయత్నాన్ని మనందరం కలసి అడ్డుకుందాం. మీ తరపున నేను పోరాడతాను’అని హామీ ఇచ్చి ఆ రైతులకు ధైర్యం చెప్పారు.
పైలీన్ పరిహారమే లేదు : అదేవిధంగా ఆవకండ వద్ద చెరుకు రైతులు కూడా జగన్‌తోతమ బాధలు చెప్పుకున్నారు. ‘గత ఏడాది పైలీన్ వచ్చి పంటలను నాశనం చేసింది. కానీ ఆ పరిహారమే ఇంతవరకు మాకు రాలేదు. ఇప్పుడు ఈ తుపాను మొత్తం ఊడ్చేసింది. ఇంతవరకు ఎవ్వరూ రాలేదు. మాకు బీమా కూడా లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు’అని రైతులు వాపోయారు. ఏలేరు, పులికాలువ పొంగి 3,500 ఎకరాలు నీటమునిగిపోతున్నాయి. కానీ ఏలేరు కాలువకు లైనింగ్ చేయించాలనిగానీ కాలువలోని ఆక్రమణలను తొలగించాలనికానీ ప్రభుత్వం భావించడం లేదు. ఇలా అయితే సాగు ఎలా చేసేది’అని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఎకరాకు రూ.15వేలు నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వంతో పోరాడతానని చెప్పారు. అలాగే ఏలేరు కాలువ లైనింగ్ పనులు, ఆక్రమణల తొలగింపునకు పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేస్తుందన్నారు.
నీటమునిగిన గుడిసెల్లోనే ఉంటున్నాం : భారీ వర్షాలకు జలమయమైన అనకాపల్లి చవితిన వీధిలోని అన్ని గుడిసెలు, ఇళ్లను జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పిట్ల సత్యమ్మ మాట్లాడుతూ ‘ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి రెండేళ్ల క్రితం మాతో రూ.వెయ్యి కట్టించుకున్నారు. కానీ ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదు. ఈ గుడిసెల్లోనే కాలం గడుపుతున్నాం. కొంచెం వానకే ఈ గుడిసెలు మునిగిపోతున్నాయి. అయినా ఎవ్వరికీ మాపై జాలి కలగడం లేదు. ఆరురోజులుగా నీళ్లలోనే మగ్గుతున్నా ఎవ్వరూ రాలేదు బాబు’అని కన్నీటిపర్యంతమయ్యారు. అందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేయించేలా పోరాడతానని జగన్‌వారికి భరోసా ఇచ్చారు. గుడిసెల్లో ఉంటున్నవారి వివరాలను పార్టీ నేతలు రాసుకుని అవసరమైతే ధర్నా చేసి మరీ పక్కా ఇళ్లు మంజూరు చేయిస్తారన్నారు.
తోటలు పోనాయి... కట్టెలూ లేవు : ఇక విశాఖ ఏజెన్సీలో గిరిజనుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. వై.ఎస్.జగన్ వారి వద్దకు వెళ్లగానే గిరిజ నులు పెద్ద సంఖ్యలో ఆయన వద్దకు వచ్చేశారు.‘ అన్నా... కాఫీ తోట పోనాది. నారింజ, బత్తాయి, చింత చెట్లూ కూలిపోనాయి. మాకు ఏ సాయం అందలే. ఏం సేయాలో తెలీడం లేదన్నా’ అని పాడేరు మోదుపల్లిలోని కొండపల్లి కోతమ్మ, సుంకు సన్నమ్మ అనే గిరిజన మహిళలు గొల్లుమన్నారు. ‘ అన్నా... ఇల్లు కూలిపోనాది. తోట పోనాది. చెట్టు పడి ఎద్దు చచ్చిపోనాది. చేతిలో దమ్మిడీ లేదు.
ఇంతవరకు మా దగ్గరకు ఎవ్వరూ రాలే. మేం ఏం చేసేది. ఏలా బతికేదీ’ అని జూరీక్ అనే గిరిజన రైతు వాపోయారు. యరడపల్లిలో బురదలో నడుస్తూ మరీ బాధితుల చెంతకు వెళ్లారు. కూలిన ఇళ్లను పరిశీలించారు. గిరిజనులతో మాట్లాడారు. ‘వంట చేద్దామంటే గుప్పెడు తిండి గింజలు లేవు. పొయ్యి కిందకు పుల్లలు కూడా లేవు. బిడ్డలతో పస్తులుం టున్నా గవర్నమెంటోల్లు సాయం చేయలేదన్నా’ అని దిమ్మి రేవతి అనే గిరిజన మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు పార్టీతరపున సహాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.
బాధితులకు పరామర్శ
కొండ చరియ విరిగిపడి మదరసోలకు చెందిన గెమ్మల రాజన్న ఐదుగురు కుటుంబ సభ్యులు మృతిచెందిన నేపథ్యంలో రాజన్నను వై.ఎస్.జగన్ పరామర్శించారు.
అరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతుల కుటుంబసభ్యుని వద్దకు వెళ్లారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ పేదలకు పార్టీ తరపున సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. వారందరికీ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శనివారం రాత్రి 11గంటలవరకు ఏజెన్సీలో పర్యటించిన వై.ఎస్.జగన్ విశాఖపట్నంకు తిరుగుప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి పీవీజీ కుమార్, జెడ్పీటీసీ సభ్యులు పి.నూకారత్నం, పి.సత్యవతి, నళిని కృష్ణ, పద్మకుమారి, ఎంపీపీలు వి.ముత్యాలమ్మ, బాలరాజు, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.