ఆ ఎత్తు అయితేనే ప్రాణ‘హితం’! | Unless the height pranahitam '! | Sakshi
Sakshi News home page

ఆ ఎత్తు అయితేనే ప్రాణ‘హితం’!

Published Thu, Feb 5 2015 1:42 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM

ఆ ఎత్తు అయితేనే ప్రాణ‘హితం’! - Sakshi

ఆ ఎత్తు అయితేనే ప్రాణ‘హితం’!

  • ప్రాణహిత బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్రకు స్పష్టం చేసిన తెలంగాణ
  • రాష్ట్ర అధికారులతో నలుగురు సభ్యుల ‘మహా’బృందం భేటీ
  • ఎత్తుకు సూత్రప్రాయ సమ్మతి తెలిపిన మహారాష్ట్ర
  • బాబ్లీ 0.6టీఎంసీల నీటి విడుదలపై ఎటూ తేల్చని సమావేశం
  • సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్లతో నిర్మించనున్న బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులతో తెలంగాణ అధికారులు జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. నిర్ణీత ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తేనే ప్రాణహిత ప్రాజెక్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలంగాణ చేసిన వాదనకు మహారాష్ట్ర అభ్యంతరం చెబుతూనే..ఎత్తుపై  తన సమ్మతాన్ని సూత్రప్రాయంగా తెలియజేసింది. మరో విడత చర్చలతో ఈ అంశానికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలని నిర్ణయించింది.

    ఇదే సమయంలో ప్రాజెక్టు పరిధిలో గోదావరి నుంచి ఏడాదిలో ఏ సమయంలో ఎంత నీరు లభ్యమవుతుందో తెలియజేసే అధ్యయన నివేదికను తమకు అందించాలని కోరింది. దీంతో మరో అడుగు దూరంలో చర్చలు మిగిలినట్లయింది.  ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల మండల పరిధిలోని తుమ్మిడిహెట్టి గ్రామంలో నిర్మించ తలపెట్టిన బ్యారేజీలో ఎత్తిపోసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.

    దీనికోసం బ్యారేజీ ఎత్తును 152 మీటర్లుగా తెలంగాణ నిర్ణయించగా మహారాష్ట్ర తొలినుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది. దీనిపై గతంలోనే ఒకసారి చర్చించిన ఇరు రాష్ట్రాలు బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రాంతాలపై కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్)తో అధ్యయనం చేయాలని నిర్ణయించాయి. సీడబ్ల్యూపీఆర్‌ఎస్ రెండు నెలల క్రితమే అధ్యయన నివేదికను ఇరు రాష్ట్రాలకు అందజేసింది. అందులో తెలంగాణ వాదనను సమర్థిస్తూ 152 మీటర్ల బ్యారేజీ ఎత్తుకు పూర్తి మద్దతు తెలిపింది.

    నివేదిక అందిన తర్వాత మరోమారు భేటీ నిర్వహించాలని భావించినా వివిధ కారణాలతో అది కుదరలేదు. అయితే త్వరగా ఈ అంశాన్ని ముగించాలని తెలంగాణ మరోమారు ప్రత్యేకంగా కోరిన నేపథ్యంలో బుధవారం మహారాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు రాష్ట్రానికి వచ్చారు. మహారాష్ట్ర నాగ్‌పూర్ జిల్లా చీఫ్ ఇంజనీర్ ఆర్.ఎం.చవాన్, సూపరింటెండెంట్ బగాఢే సహా మరో ఇద్దరు అధికారులు ఇక్కడి జలసౌధలో రాష్ట్ర అధికారులతో భేటీ అయ్యారు. దీనికి ప్రభుత్వ సలహా దారు విద్యాసాగర్‌రావు, ఈఎన్‌సీ మురళీధర్, ప్రాణహిత సీఈ హరిరామ్, సీడీఓ సీఈ ప్రదీప్‌కుమార్,హైడ్రాలజీ సీఈ శంకర్‌నాయక్‌లతో పాటు సీడబ్ల్యూపీఆర్‌ఎస్ నుంచి సీనియర్ రీసెర్చ్ అధికారి రమేశ్‌లు హాజరయ్యారు.
     
    బాబ్లీపై తేలని పంచాయితీ..

    మహారాష్ట్ర అధికారులు బాబ్లీ ప్రాజెక్టుపై విడిగా రాష్ట్ర అధికారులతో భేటీ అయ్యారు. ఈ భేటీకి సుప్రీంకోర్టు నియమించిన పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడు మహేంద్రన్ సైతం హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్చి 1న తెలంగాణకు బాబ్లీ నుంచి విడుదల చేయాల్సిన 0.6 టీఎంసీల నీటిపై చర్చలు జరిగాయి. అయితే ఈ ఏడాది నీటి లభ్యత తక్కువగా ఉన్న దృష్ట్యా నీటిని విడుదల చేయలేమని మహారాష్ట్ర చెప్పగా అదేమీ కుదరదని రాష్ట్రం స్పష్టం చేసింది. దీనిపై మరోమారు స్టాండింగ్ కమిటీలో చర్చించాలని నిర్ణయించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement