మూడుసార్లు వాయిదా పడిన ఏపీ అసెంబ్లీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం గందరగోళం నెలకొనటంతో సభ మూడుసార్లు వాయిదా పడింది. ఓవైపు అధికార పక్ష సభ్యుల అభ్యంతరాలు.. విమర్శలు.. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష సభ్యుల నిరసన మధ్య శాసనసభ ముచ్చటగా మూడుసార్లు వాయిదా పడింది. సభ్యుల నిరసనల, నినాదాల మధ్య తొలిగా పది నిమిషాలు, రెండోసారి పదిహేను నిమిషాలు, మూడోసారి కూడా పదిహేను నిమిషాలు వాయిదా పడటం విశేషం.
అంతకు ముందు నిరసన సందర్భంగా అనైతికంగా ప్రవర్తించారంటూ ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులను అసెంబ్లీ సమావేశాల వరకూ సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్ మైక్ తొలగించడమే కాకుండా.. ఆయనపై దాడి చేసే యత్నం చేశారని మంత్రి ఆరోపించారు.
దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు ఆర్ శివప్రసాదరెడ్డి, ఎం మణిగాంధీని సస్పెండ్ చేయాలని తీర్మానించారు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం నిరసన వ్యక్తం చేసింది. న్యాయం జరగాలంటూ నినదించింది. స్పీకర్ పోడియం చుట్టుముట్టి వుయ్ వాంట్ జస్టిస్ అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.