రణభూమిగా కె.వెంకటాపురం సభ
జిల్లా అంతటా రసాభాసగా జన్మభూమి
విశాఖపట్నం: వాగ్యుద్ధాలు...కొట్లాటలతో జన్మభూమి సభలు దద్దరిల్లిపోయాయి. జిల్లా వ్యాప్తంగా శుక్రవారంనాటి సభల్లో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సమస్యలు పరి ష్కారం కానప్పుడు సభలెందుకంటూ పాయకరావుపేటలో జరిగిన సభను వైఎస్సార్‌సీపీ జెడ్పీ ప్లోర్ లీడర్ చిక్కాల రామారావుతో పాటు ఇతర విపక్షపార్టీల నేతలు అధికారులను నిలదీశారు. సమస్యలు పరిష్కరించే వరకూ సభ జరగనిచ్చేది లేదంటూ అడ్డుకున్నారు. జన్మభూమిక కమిటీలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గంటసేపు గందరగోళం నెలకొంది. ఎకాయెకిన నర్సీపట్నం ఆర్డీవో కె.సూర్యారావు,ఎలమంచిలి సీఐ కె. వెంకట్రావులు అక్కడికి చేరుకున్నారు. మీ సమస్యలు చెబితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గత జన్మభూమిలో ఇచ్చిన వినతులను ముందు పరిష్కరించండి..ఆ తర్వాతే సభను నిర్వహించండి అంటూ చిక్కాల నిలదీశారు. వరుసగా చిక్కాల, తదితరులు సమస్యలు ఎకరవుపెట్టారు. వాటిని ప్రభుత్వానికి నివేదిస్తామన్న ఆర్డీవో హామీతో పరిస్థితి సద్దుమణిగింది. కోటవురట్ల మండలం కె.వెంకటాపురం గ్రామసభ యుద్ధవాతావరణాన్ని తలపించింది.
70 మంది అర్హులు ఉంటే వారికి ఎందుకు పింఛన్లు మంజూరు చేయ లేదని నిలదీశారు. జన్మభూమి కమిటీలు తమ కార్యకర్తలకే పింఛన్లు ఇస్తున్నాయంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రశ్నించడంతో అక్కడే ఉన్న జన్మభూమి కమిటీ సభ్యులు వారిపై విరుచుకుపడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పిడిగుద్దులకు దిగారు.
వారి చొక్కాలు చించేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అక్కడ నుంచి పంపేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు వంత ర వెంకటలక్ష్మి సభలో ఇదే అంశంపై మాట్లాడుతుండగా ఎమ్మెల్యే అనిత ఆమె నుంచి మైకు లాక్కొని ఏక వచనంతో ‘నీకు రాజకీయాలు కొత్త..ఏం మాట్లాడతావ్‘ అంటూ అవహేళనగా మాట్లాడారు. దీనిపై జెడ్పీటీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి గంటా శ్రీనివాసరావు లేకుండా 72వ వార్డు అడవివరంలోని ఇందిరా ప్రియదర్శిని కల్యాణమండపంలో జరిగిన గ్రామసభలో వామపక్షాల నేతలు సభను అడ్డుకున్నారు. పంచగ్రామాల భూసమస్యని తీరుస్తామని టీడీపీ హామీలు కురిపించి ఇప్పుడు పట్టించుకోవడం లేదని, దేవస్థానం దాడులు, చర్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గంటా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అరకులోయ మండలం పెదలబుడులో గ్రామస్తుల ఒత్తిడి మేరకు బాక్సైట్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. బుచ్చెయ్యపేట మండలం పెదపూడి సభను సర్పంచ్‌తో పాటు పలువురు అడ్డుకున్నారు. టీడీపీ పార్టీ మీటింగ్‌లా నిర్వహిస్తున్న ఈసభల వల్ల ఎవరికి ప్రయోజనం అంటూ సర్పంచ్ సారుపల్లి అప్పలనరస, మాజీ సర్పంచ్ కుంచం ప్రకాశరావు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
నాయకులు ప్రసంగాలు చేస్తుండగా జెడ్పీ సీఈవో జయప్రకాష్ తదితరులు మైక్‌ను బలవంతంగా లాక్కొన్నారు. దీనిపై టీడీపీ, వైఎస్సార్‌సీపీ నాయకుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం చివరకు కొట్లాటకు దారితీయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేశారు. రాజకీయ కారణాలతో సాక్షర భారత్ కో-ఆర్డినేటర్ తోలగింపు సబబుకాదని కె.కోటపాడు మండలం వి.సంతపాలెంలో జరిగిన గ్రామసభలో సర్పంచ్ వేచలపు సింహద్రప్పడు(చలం), బోడ్డు సూర్యనారాయణమూర్తిలు అధికారులను నిలదీశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో జన్మభూమి సభలు రసాభసాగా సాగాయి.
వాగ్యుద్ధాలు..కొట్లాటలు
Published Fri, Jan 8 2016 11:21 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement