జూన్‌ నాటికి వంశ'ధార' | Vamsadhara Project Works Will Be Completed By June | Sakshi
Sakshi News home page

జూన్‌ నాటికి వంశ'ధార'

Published Sun, Nov 17 2019 5:47 AM | Last Updated on Sun, Nov 17 2019 5:47 AM

Vamsadhara Project Works Will Be Completed By June  - Sakshi

సాక్షి, అమరావతి: వంశధార ప్రాజెక్టు రెండో దశ, వంశధార–నాగావళి అనుసంధానం పనులను జూన్‌ నాటికి పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. దీనికి అవసరమైన రూ.463.29 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నీటి సంవత్సరం ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి చేసి వంశధార జలాలను కొత్తగా 60 వేల ఎకరాల ఆయకట్టుకు అందించడంతోపాటు 2.47 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడానికి మార్గం సుగమం చేయాలని నిర్ణయించారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా రూపురేఖలను సమూలంగా మార్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పనులకు ప్రాధాన్యతనిస్తోంది. 

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో ప్రారంభమై..  
శ్రీకాకుళం జిల్లా భామిని మండలం నేరడి వద్ద వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా సర్కార్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో రైతులకు ముందస్తుగా సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. వంశధార ప్రాజెక్టు రెండో దశ డిజైన్‌లో మార్పులు చేసి 2004లో చేపట్టారు. కాట్రగడ్డ వద్ద వంశధారపై తాత్కాలికంగా సైడ్‌ వియర్‌(మత్తడి) నిర్మించి, రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని  తరలించి 0.069 టీఎంసీల సామర్థ్యంతో సింగిడి వద్ద ఒకటి, 0.404 టీఎంసీలు నిల్వ చేసుకునేలా పారాపురం వద్ద మరొకటి.. హీరమండలం వద్ద 19.05 టీఎంసీల సామర్థ్యంతో మరొక రిజర్వాయర్‌ను నిర్మించే పనులను చేపట్టారు. 2009 నాటికే సింహభాగం పూర్తయ్యాయి. మిగిలిన పనులను పూర్తి చేయడంలో 2009– 2019 మధ్య ఉన్న ప్రభుత్వాలు విఫలమయ్యాయి. 

జూన్‌లోనే నారాయణపురం ఆయకట్టుకు నీళ్లు.. 
నాగావళిలో జూలై ఆఖరు నాటికిగానీ వరద ప్రారంభం కాదు. దీని వల్ల నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట కింద 37 వేల ఎకరాల్లో సకాలంలో ఖరీఫ్‌ పంటలు సాగు చేయలేని దుస్థితి నెలకొంది. ఈ దుస్థితిని తప్పించేందుకు హీరమండలం రిజర్వాయర్‌ నుంచి రోజుకు ఐదు వేల క్యూసెక్కుల వంశధార జలాలు 33.24 కిమీల పొడువున తవ్వే హైలెవల్‌ కెనాల్‌ ద్వారా నారాయణపురం జలాశయంలోకి తరలిస్తారు. తద్వారా వంశధార–నాగావళి నదులను అనుసంధానం చేసే పనులనూ జూన్‌ నాటికి పూర్తిచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఈ హైలెవల్‌ కెనాల్‌ కింద కొత్తగా 15 వేల ఎకరాల ఆయకట్టుకు, నారాయణపురం ఆయకట్టుకూ ఖరీఫ్‌లో సకాలంలో నాట్లుపడేలా నీళ్లివ్వాలని నిర్ణయించారు. వంశధార ప్రాజెక్టు రెండో దశ, వంశధార–నాగావళి నదుల అనుసంధానం వల్ల కొత్త, పాత కలిపి 3.07 లక్షల ఎకరాలు సస్యశ్యామలమవుతాయని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

శరవేగంగా పూర్తిచేయాలని... 
వంశధార ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టాలని ఈనెల 13న నిర్వహించిన సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కాట్రగడ్డ వద్ద సైడ్‌ వియర్‌ పనుల్లో మిగిలిన వాటిని వరద ప్రారంభమయ్యేలోగానూ,  సింగిడి బ్యారేజీ పనులను జూన్‌ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. హీరమండలం రిజర్వాయర్‌ స్పిల్‌ వే, రివిట్‌మెంట్‌ పనులు పూర్తి చేయడం ద్వారా 19.05 టీఎంసీలు నిల్వ చేసేందుకు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. జూన్‌లోనే జాతికి అంకితం చేయాలని నిర్ణయించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement