అమానుషంగా ప్రవర్తించారు
Published Sun, Aug 25 2013 3:42 AM | Last Updated on Fri, May 25 2018 8:09 PM
సాక్షి, రాజమండ్రి :రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన ఐదు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో ప్రభుత్వం అవలంబించిన వైఖరి అమానుషంగా ఉందని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు, దివంగత ముఖ్యమంత్రి సతీమణి అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. స్థానిక కోటగుమ్మం వద్ద శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు వైఎస్ కుటుంబాన్ని ఎంత ఇబ్బందులకు గురిచేస్తున్నా,
ఆ కుటుంబానికి ఇంకా ప్రజాబలం పెరుగుతూనే ఉందన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న వైఎస్సార్ సీపీని కుయుక్తులతో ప్రజల నుంచి వేరు చేయలేరన్నారు. అర్ధరాత్రి 1.55 గంటలకు పోలీసులు కనీసం అంబులెన్స్ కూడా లేకుండా వచ్చి దీక్షను భగ్నం చేయడం దారుణమన్నారు. కాకినాడలో మంత్రి తోట నరసింహం సతీమణి నిరవధిక దీక్ష చేపట్టినప్పుడు వ్యవహరించినట్టుగా కూడా ప్రవర్తించలేదని విచారం వ్యక్తం చేశారు. వేదికపై ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సైతం కిందకు నెట్టేసి విజయమ్మను తరలించారన్నారు.
బుచ్చయ్యా..
ఆలోచించి మాట్లాడు
వైఎస్‌పై టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి చేసిన వ్యాఖ్యలను ఆదిరెడ్డి ఖండించారు. గతంలో వైఎస్ తెలంగాణపై కేంద్రానికి ఓ నివేదిక మాత్రమే పంపారని, తెలంగాణ ఇమ్మని సిఫారసు చేయలేదని గుర్తు చేశారు. తెలంగాణ ఇవ్వాలనుంటే 2004, 2009లో అధికారం చేపట్టినప్పుడే అలా జరిగి ఉండేదని వివరించారు.చంద్రబాబునాయుడు సమైక్య రాష్ట్ర ఆశయాన్ని ముక్కలు చేస్తూ లేఖ ఇచ్చినందువల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందని విచారం వ్యక్తం చేశారు.
పజలు తిరగబడుతుండడం వల్ల దిక్కుతోచని ఆ పార్టీ నేతలు ఆత్మరక్షణ కోసం అర్ధంలేని ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు. సచివాలయంలో ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని చంద్రబాబును కోరగా, రాష్ట్ర విభజనకు తాను కట్టుబడి ఉన్న విషయాన్ని ప్రకటించడాన్ని గుర్తుచేశారు. జిల్లాలో పెద్దఎత్తున సమైక్యాంధ్ర ఉద్యమాలు సాగుతున్నా, ముందుకు రాని టీడీపీ నేతలు ఎదుటివారిని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు.
సమైక్య ఉద్యమాన్నిముందుకు తీసుకెళ్తాం
పార్టీ శ్రేణులతో చర్చించి రాజమండ్రి 50 డివిజన్లలోను సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆదిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం నుంచి డివిజన్ల వారీగా నిరసనలు చేపట్టేందుకు ఉద్యమ ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలపరిచేందుకు కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement