
సీఎంతో భేటీ కానున్న విజయశాంతి
హైదరాబాద్ : మెదక్ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో సోమవారం భేటీ కానున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆమెను టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. చాలాకాలం నుంచి కాంగ్రెస్ వైపు చూస్తున్న ఆమె ఇక త్వరలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే భావన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో ఢిల్లీలో సమావేశం కావడంతో ఆ పార్టీలో చేరికపై పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మెదక్ ఎంపీ విజయశాంతి పార్టీని వీడే అంకానికి అధినేత సస్పెన్షన్‌తో ముగింపునిచ్చారు. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడతున్న క్రమంలోనే విజయశాంతి పార్టీని వీడతారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరేందుకు విజయశాంతి మంతనాలు సాగించిందనే పక్కా సమాచారంతో సస్పెన్షన్ వేటు వేశారు. ‘తల్లి తెలంగాణ’ వ్యవస్థాపక అధ్యక్షురాలు విజయశాంతి 2009 సాధారణ ఎన్నికలకు ముందు తాను స్థాపించిన సంస్థను టీఆర్‌ఎస్‌లో విలీనం చేసింది.