మద్యం ‘రాజా’ ఎవరు?
మద్యం ‘రాజా’ ఎవరు?
Published Tue, Jul 18 2017 6:37 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
- నీళ్లు నములుతున్న అధికారులు
- దర్యాప్తు పేరిట నాన్చుడు వైఖరి
- చక్రం తిప్పుతున్న నియోజకవర్గ టీడీపీ నేత
- సంచలన మద్యం కేసు పక్కదారికి అధికార పార్టీ ఒత్తిళ్లు
నగరి: పట్టణంలో సంచలనం రేపిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ దాడి కేసును అధికారులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. పట్టణంలోని ఇందిరానగర్‌లో అధికార పార్టీకి చెందిన నాయకుని గోడౌన్‌పై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం రాత్రి దాడి చేసి అధిక సంఖ్యలో మద్యం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వాటి విలువ లెక్కించాక అధికారులే విస్తుపోయారు. దీని విలువ సుమారు కోటి రూపాయలని అంచనా. నిందితుడి పేరు వెల్ల డించడానికి మాత్రం మల్లగుల్లాలు పడుతున్నారు. అధికార టీడీపీ నేత ఒత్తిళ్లతోనే పేరు వెల్లడికి వెనుకంజ వేస్తున్నట్లు తెలిసింది.
అన్ని రకాల మద్యం బాక్సులు అధిక సంఖ్యలో ఉండటంతో దర్యాప్తు ఆలస్యమౌతోందని,క్షుణ్ణంగా పరిశీలించాక ఎవరికి సంబంధం ఉందో చెబుతామన్న అధికారులు సోమవారం రాత్రి వరకు వెల్లడించలేదు. సరకులను లెక్కిండానికి మూడు రోజులు పడుతుందా? ఇన్ని రోజులుగా లెక్కిస్తున్నారంటే ఎంత మద్యం ఉండాలనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించినా వివరాలు తెలపకపోవడంతో అధికార పార్టీకి చెందిన వారు కనుక అధికారులు దర్యాప్తును పక్కదోవ పట్టిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎక్సైజ్ అధికార సిబ్బంది 1050 కేసులు మద్యం సీసాలు, 1250 కేసులు బీరు సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మద్యం కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం.
వివరాలు చెప్పడానికి అధికారులు నిరాకరిస్తుండటంతో దొరికింది పాత మద్యమా లేక సెకండ్స్ మద్యమా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. మద్యం కేసులో పట్టుబడిన వారు సొంత పార్టీకి చెందిన వారైనా వదలిపెట్టమని సీఎం చంద్రబాబు నాయుడు చెబుతుంటే అదే పార్టీ నాయకులు ఇలాంటి కేసుల్లో వత్తాసు పలకడం కలకలం రేపుతోంది. నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఈ విషయంలో తెరవెనుక రాజకీయం చేస్తూ అధికారులపై ఒత్తిడి తెస్తుండటంతోనే అధి కారులు వివరాలు వెల్లడించడం లేదని సమాచారం.
Advertisement
Advertisement