![ఎయిరిండియా గురించి ప్రధానితో చర్చిస్తా: అశోక్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/81401346693_625x300.jpg.webp?itok=cvwFzrWk)
ఎయిరిండియా గురించి ప్రధానితో చర్చిస్తా: అశోక్
ఎయిరిండియాను పునరుద్ధరించే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీతో చర్చిస్తానని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తెలిపారు. తన మంత్రిత్వశాఖ ప్రధాన కార్యాలయమైన రాజీవ్ గాంధీ భవన్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎయిరిండియాకు ఎందుకు నష్టాలు వస్తున్నాయో విశ్లేషించాలని, పోటీ వల్లేనా.. మరేదైనా కారణం ఉందా అన్నది తెలుసుకోవాలని ఆయన అన్నారు.
ఎయిరిండియా ఇటీవలే నష్టాల నుంచి కొద్దిమేర బయటపడి లాభనష్టాలు లేని పరిస్థితిలోకి చేరుకుంది. మొత్తం ఎయిరిండియా ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని రాజు చెప్పారు. జెట్ ఇంధనాన్ని నేరుగా దిగుమతి చేసుకోవడానికి అనుమతించడం లాంటి సంస్కరణలు కొన్ని చేపట్టినా, విమానయాన పరిశ్రమ ఇంకా కోలుకోలేకపోతోంది. కొన్ని వివాదాలున్నా, వాటిని తాను అప్పుడే ప్రస్తావించబోనని ఆయన అన్నారు.