సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా లభిస్తుందా? అన్న అంశం తాజాగా తెరపైకి వచ్చింది. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద 2008 డిసెంబర్ 16న వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాప న చేశారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 16.40 లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి 28 ప్యాకేజీల ద్వారా రూ.38,500 కోట్లతో శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని సిర్పూర్, చెన్నూర్, బెల్లంపల్లి, నిర్మల్, ముథోల్ ఐదు నియోజకవర్గాలు, 19 మండలాలు, 306 గ్రామాలకు చెందిన 1,56,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
వైఎస్ మరణంతో గ్రహణం
తుమ్మిడిహెట్టి వద్ద నుంచి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వరకు 1,055 కిలోమీటర్ల పొడవున కాల్వ తవ్వకాలు జరపడంతోపాటు ఏడు జిల్లాలో పనులు నిర్వహించేందుకు టెండర్లు కూడా పూర్తయి ప్రాజెక్టు పనులు జోరందుకునే క్రమంలో మహానేత అకాల మరణానికి గురయ్యారు. తెలంగాణ ప్రజల కలల సాకారమైన భారీ ప్రాజెక్టు పనులు మందగించిపోగా ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన పాలకులు అంతగా పట్టించుకోక పోవడంతో ప్రాజెక్టుకు గ్రహణం పట్టుకుంది. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఆస్తులు, అప్పులు, ఉద్యోగాలు, వనరులు తదిత ర అంశాలపై కేంద్ర మంత్రి మండలి(జీవోఎం) పరిశీలిస్తున్న విషయం విదితమే. ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే అంశంపై టీ-కాంగ్రెస్ మంత్రులు, నేతలు జీవోఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ సారైనా జాతీయ హోదా దక్కుతుందా? అన్న చర్చ జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటికైనా ఈ ప్రాజెక్టుకు జాతీయ దక్కి పూర్తయితే తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్న అభిప్రాయాన్ని ఇంజినీరింగ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
జాతీయ హోదా లభిస్తుందా?
Published Sat, Nov 23 2013 5:43 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement