
నేను ఏదీ చెప్పను!: చంద్రబాబు
విడదీయాలన్నా, కలిపి ఉంచాలన్నా రెండు ప్రాంతాలవారిని ఒప్పించాలి: చంద్రబాబు
ప్రధాని మన్మోహన్, సోనియా, రాహుల్ ఎందుకు నోరు విప్పడం లేదని ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను కలిపి ఉంచాలనిగానీ లేదా విభజించాలనిగానీ తాను చెప్పనని తెలుగుదే శం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని విభజించాలన్నా లేదా కలిపి ఉంచాలన్నా రెండు ప్రాంతాల వారిని ఒప్పించాలన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకునే వారు తెలంగాణ ప్రాంతం వారిని ఒప్పించాలని, అదే సమయంలో విభజించాలని కోరుకునే వారు సీమాంధ్ర ప్రాంతం వారిని ఒప్పించాలన్నారు. శుక్రవారం టీడీఎల్పీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యను పరిష్కరించే దిశగా ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రయత్నించకపోవటం దారుణమన్నారు. ఈ విషయంలో వారు ఎందుకు నోరు విప్పటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టికల్-3ని తొలగించాలని పలు పార్టీల వారిని కలిశారని, అయితే ఆ ఆర్టికల్‌ను తొలగించటం సాధ్యం కాదన్న విషయం ఆ పార్టీ నేతలకు తెలియదన్నారు.
సోనియా ఆదేశాల మేరకే జగన్ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉన్నారని విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ కుమ్మక్కయ్యాయని దుయ్యబట్టారు. రాజ్యసభ ఎన్నికల్లో విప్ ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాల్సిందిగా స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. తాను ఢిల్లీలో ఆరోగ్యం పాడుచేసుకుని దీక్ష చేస్తే ఎవ్వరూ పట్టించుకోలేదని, మీడియా కూడా సరిగా కవరేజ్ ఇవ్వలేదని, సీఎం అక్కడ 2 గంటలు కూర్చుంటే విపరీతమైన కవరేజ్ ఇచ్చారన్నారు. విభజనలో భాగం పంచుకుంటున్న వారందరి అడ్రస్ వచ్చే ఎన్నికల్లో గల్లంతవుతుందన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని చెప్పారు.
ఈ విలేకరుల సమావేశానికి సాక్షిని అనుమతించి ఉంటే బాబు నుంచి ఈ ప్రశ్నలకు సమాధానం కోరేది.
విభజనకు ఇరు ప్రాంతాల వారిని ఒప్పించాలనే మాట 2008లో తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చినపుడు ఎందుకు చెప్పలేదు? అఖిలపక్ష సమావేశంలో ఎందుకు చెప్పలేదు?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 లో సవరణలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపాదించిందే తప్ప తొలగించమని చెప్పలేదు. దాన్ని సవరించడానికి అవకాశం లేదంటారా? విభజన విషయంలో మీ వైఖరేంటో ఎందుకు సూటిగా చెప్పలేకపోతున్నారు?
టీడీపీలో ఎవరి వాదన వారిదే
రాష్ర్ట విభజన విషయంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత తెలుగుదేశం నేతలు శుక్రవారం యథావిధిగా ఎవరి వాదనలు వారు వినిపించారు. శుక్రవారం టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడిన తర్వాత పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ... విభజనను వ్యతిరేకిస్తూ తాము వేసిన పిటిషన్లు శుక్రవారం కోర్టులో విచారణకు వస్తాయని తెలిసే గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తాము మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. దీని తర్వాత కొద్దిసేపటికే ఎర్రబెల్లి దయాకరరావు మీడియాతో మాట్లా డుతూ విభజనపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేయటాన్ని స్వాగతించారు. ఇప్పటికైనా సమైక్యవాదులు బుద్ధి తెచ్చుకోవటంతో పాటు మరోసారి చిల్లర చేష్టలకు పాల్పడవద్దన్నారు.