గుంటూరు, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు టెన్షన్ పట్టుకుంది. అందుకు కారణం.. పెద్దల సభకు జరగబోయే ఎన్నికలు. తద్వారా రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతు అయ్యే అవకాశం. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారంపై విచారణ నేపథ్యంలో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠా నెలకొంది.
సాధారణ ఎన్నికలకు ముందే రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతు కానుంది. కారణం ఉన్న ఒకే ఒక్క సభ్యుడు కనకమేడల పదవీకాలం పూర్తి కానుంది. దీంతో ఉన్న ఒక్క సీటు కూడా దూరం కానుంది. ఇక ఎమ్మెల్యే సంఖ్యా బలంతో వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో మూడింటికి మూడు స్థానాలు దక్కించుకుంటామనే ధీమాతో ఉంది వైఎస్సార్‌సీపీ. ఈ తీవ్ర ఆందోళనల నడుమే దుష్ట రాజకీయానికి తెర లేపినట్లు స్పష్టమవుతోంది.
ఎందుకు..
ఏప్రిల్ 2తో వైఎస్సార్‌సీపీ సభ్యుడు వేమిరెడ్డి, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, టీడీపీ సభ్యుడు కనకమేడల పదవీకాలం ముగియనుంది. సంఖ్యాబలాన్ని బట్టి ఈ మూడూ వైఎస్సార్‌సీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి. రాష్ట్ర కోటాలోని 11 స్థానాలు వైఎస్సార్‌సీపీ పరం కానున్నాయి. తద్వారా రాజ్యసభలో ఉనికే లేకుండాపోనుంది టీడీపీ. అదే జరిగితే.. 41 ఏళ్లలో టీడీపీకి రాజ్యసభలో సభ్యత్వం లేకుండాపోవడం ఇదే తొలిసారి కానుంది.
ఇదీ చదవండి: రాజ్యసభ సీట్ల కోసం నోటిఫికేషన్ విడుదల
వ్యూహ-ప్రతివ్యూహాలు
రాజ్యసభ ఎన్నికలకు ఎమ్మెల్యే ఓట్లే కీలకం కానున్నాయి. దీంతో ఎన్నికలు జరగనున్న 3 స్థానాలకు షెడ్యూల్ రావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ-ప్రతివ్యూహాలతో అప్రమత్తమయ్యాయి. ఈ సారి ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాలనూ గెలుచుకుంటామని వైఎస్సార్‌సీపీ ధీమాతో ఉండగా.. ఒక్క సీటుకు పోటీ పెట్టాలన్న ఆలోచనలో టీడీపీ ఉంది. ప్రస్తుతం స్పీకర్ ముందు నలుగురు వైసీపీ రెబల్స్, మరో నలుగురు టీడీపీ రెబల్స్ అనర్హత పిటిషన్లు ఉన్నాయి. ఈ లెక్కన ఒక సీటు గెలవాలంటే దాదాపు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. గంటా రాజీనామా ఆమోదం ద్వారా టీడీపీ కి ఒక సీటు తగ్గింది.
మళ్లీ అదే బాటలో బాబు..
తెలుగుదేశం అనగానే గుర్తొచ్చేది పార్టీ ఫిరాయింపులు. తెలంగాణలో ఓటుకు కోట్లు అయినా.. ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీల డబ్బు వ్యవహారం అయినా.. ఫిరాయింపులకు టీడీపీ బ్రాండ్‌గా మారింది. మరోసారి అదే అస్త్రంపై నమ్మకం పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ. బలం లేకున్నా... పోటీకి అభ్యర్థిని పెట్టడం.. ఆ పార్టీకి వస్తోన్న అనవాయితీ. ఈ సారి రాజ్యసభ ఎన్నికల్లోనూ ఒక స్థానానికి వర్లరామయ్య, కోనేరు సురేష్ పేరు పరిశీలిస్తున్నట్టు టీడీపీ లీకులిస్తోంది. ఒకవేళ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 18కి తగ్గే అవకాశం ఉంది.ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ రెబల్ ఎమ్మెల్యేల ద్వారా నెలపాటు స్పీకర్‌ను గడువు కోరడం వెనుక చంద్రబాబే ఉన్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment