పక్షం రోజులైనా.. సాయం సున్నా
Published Mon, Nov 4 2013 1:41 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఎడతెరిపిలేని వర్షాలు వచ్చి జనం కడగండ్ల పాలై పక్షం రోజులు చూస్తూండగానే గడచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, చివరకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డే స్వయంగా జిల్లాకు వచ్చి వెళ్లినా కూడా బాధితులకు ఒరిగిందేమీ లేదు. వచ్చిన నాయకులంతా ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లారే తప్ప ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేదు.
ఇళ్లు దెబ్బ తిన్నవారిని పట్టించుకోనేలేదు
అధికార యంత్రాంగం లెక్కల ప్రకారం జిల్లాలో 3 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. అత్యధికంగా అమలాపురం రెవెన్యూ డివిజన్‌లో 806 ఇళ్లు దెబ్బతిన్నాయి. వాస్తవానికి జిల్లాలో దెబ్బతిన్న ఇళ్లు ఐదారు వేలుంటాయని అంచనా. ఇళ్లు కూలిపోయి కొందరు, మంచాలు, వంటపాత్రలు.. ఇలా సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలినవారు మరికొందరు ఉన్నారు. ఇళ్లు కూలి రోడ్డున పడిన కుటుంబాలకు ఇంతవరకూ చిల్లిగవ్వ కూడా సాయం చేయలేదు.
దెబ్బ తిన్న ఇళ్ల వద్దకు వచ్చి అధికారులు పేర్లు నమోదు చేసుకుని పది రోజులు కావస్తోంది. మండల స్థాయిలో దెబ్బతిన్న ఇళ్ల లెక్క తేల్చినా పరిహారం ఊసే లేదు. కనీసం అధికారులు గుర్తించిన బాధితుల పునరావాసానికి కూడా ఏమీ ఇవ్వలేదు. జిల్లా కేంద్రం కాకినాడలోని పర్లోపేట, సంజయ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం నాటికి కూడా పరిహారం ఇవ్వలేదని ముంపు బాధితులు కొండబాబు, వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం మాటలు.. నీటిమూటలు ఇళ్లు దెబ్బ తిన్నవారికి దుస్తులు, వంటపాత్రల కోసం తక్షణ సాయాన్ని రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచినట్టు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు చెప్పారు. మగ్గాల్లో నీరు చేరినవారికి రూ.5 వేలు, నూలు, ఇతర రసాయనాల విలువనుబట్టి మరో రూ.5 వేలు తక్షణం ఇస్తామని గొప్పగా ప్రకటించారు. కానీ ఇంతవరకూ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
గుప్పెడు బియ్యానికీ గతిలేదు
ప్రజాపంపిణీ ద్వారా కేజీ బియ్యం కూడా ఇంతవరకూ ఇవ్వలేదు.
పొయ్యి మీదకి అవసరమైన సరకుల సంగతి అలా ఉంచితే.. కనీసం పొయ్యి కిందకి కావలసిన కిరోసిన్ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు.
వర్ష బాధితుల కోసం జిల్లాలో లక్షా 56 లీటర్ల కిరోసిన్ విడుదల చేసినట్టు జిల్లా యంత్రాంగం చెబుతోంది. కానీ, ఇంతవరకూ ఏ ఒక్క బాధిత కుటుంబానికి ఒక్క లీటరు కిరోసిన్ కూడా ఇవ్వలేదు.
అన్నదాతకు భరోసా ఏదీ?
జిల్లాలో వరి, పత్తి, అరటి, ఉల్లి, బొప్పాయి, కూరగాయలు, పూల తోటలు అన్నీ కలిపి 3.50 లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. చేతికొచ్చిన పంట ముంపు బారిన పడి చేలల్లోనే కుళ్లిపోతుంటే.. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు బరువెక్కిన గుండెలతో బలవన్మరణాల బాట పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు రైతులు మృతి చెందారు. తక్షణం ఆదుకొని.. వారిలో ధైర్యాన్ని నింపవలసని ప్రభుత్వం నుంచి అటువంటి స్పందనే లేదు. తాజాగా పంట నాశనమైందన్న మానసిక వేదనతో.. కొత్తపల్లి మండలం కుతుకుడుమిల్లి శివారు పెదకలవల దొడ్డిలో కౌలు రైతు నురుకుర్తి సత్యనారాయణ (55) శనివారం రాత్రి హఠాత్తుగా మృతి చెందాడు. కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామానికి చెందిన రైతు బుద్ధ శివ ఆదివారం ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. భారీ వర్షాలకు ఇతడికి చెందిన నాలుగు ఎకరాల చేను నాశనమైంది. అప్పులు తీర్చేలేని పరిస్థితుల్లో ఆత్మహత్యా యత్నం చేసుకుని, ఆస్పత్రిపాలయ్యాడు.
జిల్లాలో రైతు దయనీయ పరిస్థితిని ఈ ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. వరిలో అత్యధికంగా ఎకరాకు రూ.25 వేలు పైబడి పెట్టిన పెట్టుబడులు తిరిగి దక్కని పరిస్థితుల్లో ప్రభుత్వ సాయం కోసం రైతులు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో వచ్చిన నీలం తుపాను బాధిత రైతులకే ఇంతవరకూ ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఈసారి వర్షాలవల్ల వాటిల్లిన నష్టానికి పరిహారం అందాలంటే మరో ఏడాది ఆగాల్సి వస్తుందని అన్నదాతలు దిగులు చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల మంది రైతులు సాయం కోసం సర్కార్ వైపు చూస్తున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనపుడు తక్షణ సాయం అందించి, భరోసా ఇచ్చేవారని బాధితులు అంటున్నారు.
Advertisement