విజయవాడ (రామవరప్పాడు) : అర్హత ఉన్న తనకు ఇల్లు కేటాయించలేదని, న్యాయం జరగకపోతే ఇక్కడి నుంచి దూకేస్తానంటూ ఓ మహిళ మంగళవారం విజయవాడ శివారు ప్రసాదంపాడు ఫోర్డ్ కార్ల షోరూం సమీపంలోని హోర్డింగ్ టవర్ ఎక్కి హడావుడి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. పంచకర్ల విజయలక్ష్మి రామవరప్పాడుకు సమీపంలోని ఓ కట్టపై నివాసం ఉంటోంది. కాగా రామవరప్పాడు ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా అక్కడి నివాసాలను తొలగిస్తున్నారు. అప్పటికే పలుసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తన నివాసాన్ని కూడా తొలగిస్తారేమోననే ఆందోళనతో ఆమె సమీపంలోని టవర్ ఎక్కింది. అధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకూ దిగేది లేదంటూ పట్టుబట్టింది.
రూరల్ మండల తహశీల్దార్ మదన్‌మోహన్, పటమట సీఐ దామోదర్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెకు నచ్చజెప్పారు. ఈ విషయమై విచారణ నిర్వహించి న్యాయం చేస్తానని తహశీల్దార్ హామీ ఇవ్వడంతో టవర్ దిగింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ.. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఇల్లు కేటాయించలేదని చెప్పారు. తనలాంటి ఇంకా చాలా మంది ఉన్నారని, వారందరికీ న్యాయం చేయాలని విన్నవించింది.
న్యాయం చేయకుంటే దూకేస్తా..
Published Tue, Jul 14 2015 7:48 PM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM
Advertisement
Advertisement