
ఎదురుదాడే మీ విధానమా?
* ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, కోటంరెడ్డి
* వైఎస్‌ను, జగన్‌ను ఆడిపోసుకోవడమే సర్కారు ప్రధాన ఎజెండా
* లోటు బడ్జెట్ అంటూ మంత్రుల ఇంటి అద్దెల పెంపు సబబు కాదు
* టీడీపీ కార్యకర్తలకు రాష్ట్ర ఖజానా దోచిపెట్టడమే పనిగా మారింది
సాక్షి, హైదరాబాద్: కరువు తాండవిస్తూ అదును దాటి వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంగా మారిన తరుణంలో ప్రతిపక్షం చేసే సద్విమర్శల్ని ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా తప్పుడు లెక్కలతో ప్రభుత్వం ఎదురు దాడికి దిగుతోందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. అధికారపక్షం రైతాంగానికి ఏం చేయబోతున్నారో చెప్పకుండా వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ మోహన్‌రెడ్డిని ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. రాష్ట్రంలో ఇన్‌పుట్ సబ్సిడీ, పంట బీమా కింద రూ. 800 కోట్లు ఇవ్వాల్సి ఉందని, కేంద్రం తన వాటా విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకుండా తాత్సారం చేస్తుందని విమర్శించారు.
రుణమాఫీ కింద రూ. 56 వేల కోట్లు పంట రుణాలు రద్దు చేయాల్సి ఉండగా, కనీసం రూ.5 వేల కోట్లకు కూడా రైతులు రెన్యువల్ చేసుకోలేకపోయారని తెలిపారు. ఇలాగే కొనసాగితే ప్రభుత్వం చెప్పే విజన్ 2029కైనా రుణమాఫీ జరగదని విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘లోటు బడ్జెట్‌లో ఉన్నాం, రాజధాని నిర్మాణం కోసం చందాలివ్వండి, త్యాగాలకు సిద్ధంకండి, పొదుపు పాటించండి.. అంటూ పదే పదే వల్లె వేసే రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు మంత్రులకు ఇంటి అద్దె సరిపోవడం లేదని నెలకు రూ.50 వేలు అదనంగా ఇవ్వాలని అసెంబ్లీలో ప్రతిపాదించడాన్ని ఏమని అర్థం చేసుకోవాలో తెలియడం లేదు’’ అని విమర్శించారు. ఆల్మట్టి పాపం వైఎస్‌దేనని నిండు సభలో ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ మాట్లాడటం ఆయన విచక్షణకే వదిలేస్తున్నామన్నారు. టీడీపీ భాగస్వామిగా అప్పట్లో దేవేగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో ఏఐడీపీ నిధుల్ని రూ.300 కోట్లు కేటాయించి ఆల్మట్టి ఎత్తు పెంపునకు చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం కాదా? అని కోటంరెడ్డి ప్రశ్నించారు.
పన్నులు పెంచితే పడిపోతారు: కల్పన
‘‘పన్నులు పెంచిన ఏ ప్రభుత్వాలూ మనలేదు, ఖచ్చితంగా పడిపోతాయి. మీరు కూడా రెవెన్యూ లోటుకు పన్నులు పెంచుతున్నారా లేదా? నిధులిచ్చేందుకు కేంద్రం హామీ ఇచ్చిందా? చెప్పండి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన శుక్రవారం అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ‘‘బడ్జెట్‌లో రూ.11 వేల కోట్లు లోటు చూపించారు, ఈ నిధులను కేంద్రం ఇస్తున్నట్టు హామీ ఇచ్చిందా? లేదంటే మీరు ఏమైనా పన్నులు వసూలు చేయాలనుకుంటున్నారా?’’ అనేది స్పష్టత ఇవ్వాలన్నారు. 2004 నుంచి 2009 వరకూ ఒక్క పైసా కూడా పన్నులు పెంచకుండా, రెండుసార్లు అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదని, ఈ విషయాన్ని వైఎస్సార్ పార్టీ గర్వంగా చెప్పుకోగలదని తెలిపారు. మద్య నియంత్రణలో భాగంగా జిల్లాకో డీ అడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారని, కానీ బడ్జెట్‌లో దీనికి నిధులు కేటాయించిన దాఖలాలు లేవని విమర్శించారు.
కిరణ్‌ను కాపాడిందెవరో?: జగ్గిరెడ్డి
కాలువల్లో నీటి సరఫరాను క్రమబద్ధీకరించే లస్కర్ పోస్టుల భర్తీ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు చిర్ల జగ్గిరెడ్డి చేసిన వ్యాఖ్యలు శుక్రవారం అసెంబ్లీలో కలకలం రేపాయి. ‘‘అధ్యక్షా, మంత్రులు పదేపదే మావైపు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో తప్పిదాలకు మేమేదో కారణమంటున్నటు వారి తీరుంది. పాత ప్రభుత్వాన్ని (కిరణ్) కాపాడింది ఎవరు సార్? మద్దతు ఇచ్చింది వీళ్లు కాదా? అది మరిచి ఆ తప్పుల్ని ప్రస్తావించేటప్పుడు మావైపు చూడడం ఎంతవరకు సబబు..?’’ అన్నారు. దీనికి విపక్ష సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయగా పాలకపక్షం మిన్నకుంది.
నిరసనల మధ్య మంత్రి సమాధానం
ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యనే నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి చేతులు దులుపుకున్నారు. కర్నూలు సమీపంలోని తుంగభద్ర నదిపై 69 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చెక్‌డ్యాం బ్రిడ్జిని మంజూరు చేసిన మాట నిజమేనని చెప్పారు. అంచనా వ్యయాన్ని 190 కోట్లకు పెంచామని చెప్పారు. అయితే దీనిపై ఎస్వీ మోహన్‌రెడ్డి అనుబంధ ప్రశ్న వేసేందుకు లేచి నిల్చున్నప్పటికీ మాట్లాడే అవకాశం రాలేదు. స్పీకర్ సభను వాయిదా వేయడంతో ఆయన ప్రశ్న అడగలేకపోయారు.