హోదా ఊగిసలాడుతోంది: యనమల
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఊగిసలాడుతోందని, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో పాలనను ప్రారంభిస్తూ గురువారం పలు ప్రధాన అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ హోదాలో యనమల, మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలసి సమీక్షలు నిర్వహించారు.
అనంతరం యనమల విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలా? ప్యాకేజీ ఇవ్వాలా? అనే దానిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలకు ఆదాయం అనుకున్నంత రాకపోవడంతో రూ.3 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందన్నారు. నిధులు మంజూరుపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. రాష్ట్రంలో 19 సంస్థల్లో నిర్వహించిన లోకల్ ఆడిట్‌లో రూ.14,456 కోట్లకు సంబంధించిన 33,37,034 ఆడిట్ అభ్యంతరాలు వచ్చినట్టు వివరించారు.