
రైతుల కన్నీళ్లు తుడవడానికే జగన్ దీక్ష
తణుకు టౌన్/తాడేపల్లిగూడెం : రైతుల కన్నీళ్లు తుడవటానికి.. రైతులను, మహిళలను ఇబ్బం దులు పెడుతున్న సర్కారు తీరుపై పోరాడేం దుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో రైతు
దీక్ష చేపడుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని చెప్పారు. స్థానిక బెల్లం మార్కెట్ వద్ద ఏర్పాట్లపై సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. రైతు దీక్ష పోస్టర్‌ను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఆళ్ల నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో రైతులు, మహిళలు ఎలా పరాభవించబడుతున్నారో అందరికీ తెలుసన్నారు. రుణ విముక్తులవుదామని చంద్రబాబును గెలి పిస్తే, వాగ్దానాలను అమలు చేయకుండా మోసగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మోసానికి గురైన బాధితుల పక్షాన నిల బడి పోరాడేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు దీక్ష చేపడుతున్నారని చెప్పారు. జిల్లా ప్రజ లందరికీ తణుకు పట్టణం దగ్గరగా ఉండటం, గ్రామీణ నేపథ్యంతోపాటు గ్రామీణ నియోజకవర్గాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండటం, తూర్పుగోదావరి జిల్లాకు అందుబాటులో ఉండటంతో వైఎస్ జగన్ ఇక్కడ దీక్ష చేపడుతున్నారని వివరించారు.
రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను చూస్తున్న ప్రజలు, రైతులు దీక్షలో భాగస్వాములవుతారని పేర్కొన్నారు. ప్రజా పోరాటం చేస్తున్న ఆయనకు అందరూ అండగా నిలబడదామన్నారు. పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల ప్రజల అండదండలతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. వీరి సహకారంతో అధికారం చేజిక్కించుకుని వారినే మోసం చేస్తారని అనుకుని ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదన్నారు. ప్రస్తుత పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయన్నారు. రైతులు, మహిళలు, దళిత సమాజానికి జరుగుతున్న అన్యాయంపై పోరా టం సాగించి ఆయా వర్గాలకు బాసటగా నిలబ డాలని పిలుపునిచ్చారు. నరసాపురం పార్లమెం టరీ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని చంద్రబాబు స్తుప్తచేతనావస్థలో ఉంచారన్నారు. హామీల మీద హామీ లు ఇవ్వడం, వాటికి గడవులు విధించడం అన్యాయమన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 10 వేల పరిశ్రమలు ఖాయిలా పడ్డాయన్నారు.
వీటిని పునరుద్ధరిస్తే పది లక్షల మం దికి ఉపాధి కలుగుతుందని అన్నారు. ఇలాంటి వాటిని విస్మరించి సింగపూర్, జపాన్, అమెరికా నుంచి పరిశ్రమలంటున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి దుర్గాప్రసాదరాజు, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, తెల్లం బాలరాజు, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ముదునూరి ప్రసాదరాజు, ముఖ్య నాయకులు ధర్మాన కృష్ణదాసు, తానేటి వనిత, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, వందనపు సాయిబాలపద్మ, గూడూరి ఉమాబాల, పినిపే విశ్వరూప్, ఎస్.రాజీవ్‌కృష్ణ, పుప్పాల వాసుబాబు, తోట గోపి, చీర్ల రాధయ్య, తలారి వెంకట్రావు, ఘంటా మురళి, నాయకులు లంకా మోహన్‌బాబు, ముప్పిడి సంపత్‌కుమార్, కారుమంచి రమేష్, దాట్ల రంగావతి, దండు సూర్యనారాయణరాజు, నందిగం భాస్కర రామయ్య, వెలగల సాయిబాబారెడ్డి, కడియాల సూర్యనారాయణ, నార్గన సత్యనారాయణ, బూరుగుపల్లి సుబ్బారావు పాల్గొన్నారు.
ఎత్తిపోతలతో ప్రమాదం
వైఎస్సార్ సీపీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ తణుకు : కృష్ణా బేసిన్‌కు, రాయలసీమకు నీరంటూ ప్రభుత్వం ప్రతిపాదించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఉభయగోదావరి జిల్లాలకు ప్రమాదం పొంచి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసససభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆందోళన వ్యక్తం చేశారు. తణుకులో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ వనరుల కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ప్రారంభించారన్నారు. 11 మంది శంకుస్థాపన చేసి వదిలేసిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వైఎస్ హయాంలో రూపుదిద్దుకుందన్నారు. ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని మళ్లించుకుపోతే రెండో పంటకే కాదు, మొదటి పంటకే మోసం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల రెండు జిల్లాలు ప్రమాదంలో పడతాయన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను విస్తరిస్తే రాయలసీమకు మంచినీటిని ఇవ్వవచ్చన్నారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇటీవల ఖరారు చేసిన టెండర్లలో ఈ పనులను 18 నెలల కాలంలో పూర్తి చేయాలని మార్పులు చేశారన్నారు. మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి ఎత్తిపోతలను 18 నెలలల్లోనే పూర్తిచేయాలనడంలో ఆంతర్యం ఏమిటో గ్రహించాలన్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును అడ్డుకోడానికి సుప్రీం కోర్టులో పర్యావరణ పరిరక్షణ పేరుతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు కోర్టులకు వెళ్లాయని గుర్తు చేశారు. వీటికి బలం చేకూర్చే విధంగా చంద్రబాబు చేపడుతున్న ఎత్తిపోతల పథకాలు వ్యవహారాలు ఉన్నాయని విమర్శించారు.
సెప్టెంబర్ నాటికి గోదావరిలో 72 వేల క్యూసెక్కుల నీరు ఈ ప్రాంత ఆయకట్టుకు అవసరం అవుతుందని పేర్కొన్నారు. కొంతాలపల్లి, దుమ్ముగూడెం వంటి 11 ప్రాజెక్టుల ద్వారా గోదావరి నీటిని మళ్లిస్తే ఉభయగోదావరి జిల్లాలకు ఒక్కచుక్క నీరుకూడా రాదని, రెండు జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపచేసైనా సరే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం. వెలుగు, గాలేరు, నగరి ప్రాజెక్టులకు నిధులు కేటాయించగలిగితే రాయలసీమకు నీటిని పంపించవచ్చని స్పష్టం చేశారు.