
నాంపల్లి కోర్టుకు హాజరైన వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. గురువారం ఉదయం తన నివాసం నుంచి ఆయన సీబీఐ కోర్టుకు బయల్దేరారు. తన కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో వైఎస్ జగన్ ఈరోజు ఉదయం 10.30 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు అయ్యారు. బెయిల్ పొందిన తర్వాత ఆయన మొదటిసారిగా కోర్టుకు హాజరు అయ్యారు.
గత నెల 23న బెయిల్ మంజూరు చేసిన సీబీఐ కోర్టు.. కేసు విచారణలో భాగంగా ప్రతి వాయిదాకు హాజరుకావాలని షరతు విధించిన విషయం తెలిసిందే. కాగా జగన్ను చూసేందుకు ఆయన నివాసం వద్దకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
కాగా ఇదే కేసులో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి కోర్టుకు హాజరు కాగా మోపిదేవి వెంకట రమణ కోర్టుకు హాజరు కావల్సి ఉన్నా.... అనారోగ్యం కారణంగా హాజరు కాలేదు. మరోవైపు జగన్ కోర్టుకు హాజరు అయిన నేపథ్యంలో ....పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. న్యాయవాదులు, మీడియా ప్రతినిధులను తప్ప, అనుమతి పత్రాలు ఉంటేనే మిగతావారిని కోర్టు లోపలకు అనుమతిస్తున్నారు.