
రుణ మాఫీపై సర్కారుకు నెల గడువు
ఆ తర్వాత రైతులతో కలసి ఆందోళన చేపడతాం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
* రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తాం
* రుణాల రీషెడ్యూల్ చేయడం పెద్దగొప్పా?.. ఆ పని ఏ ప్రభుత్వమైనా చేస్తుంది
* ప్రజలను మోసం చేసిన బాబూ మీపై 420 కేసు పెట్టాలా.. 840 కేసు పెట్టాలా?
సాక్షి, శ్రీకాకుళం: ‘‘రుణ మాఫీ అనే అబద్ధపు హామీతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన చంద్రబాబు ఇప్పుడు రైతులు, డ్వాక్రా సంఘాలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మాఫీ ఊసెత్తకుండా రుణాలు రీషెడ్యూల్ చేస్తామని చెబుతున్నారు. రీషెడ్యూల్ చేయడం గొప్ప విషయమా? పదేళ్లుగా ప్రతి ప్రభుత్వం కూడా ఎప్పుడు వరదలొచ్చినా, కరువులొచ్చినా రొటీన్‌గా రుణాలు రీషెడ్యూల్ చేస్తున్నాయి. కానీ ఇదేదో గొప్ప అన్నట్లు చంద్రబాబు చెప్పడం విడ్డూరం. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ విషయంలో కాలయాపన చేస్తుండటంతో రైతులు, డ్వాక్రా సంఘాల సభ్యులను బ్యాంకులు నోటీసులతో వేధిస్తున్నాయి. ప్రభుత్వం ఇదేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.
కానీ మేం రైతుల వెంట ఉన్నాం. ప్రభుత్వానికి మరో నెల సమయం ఇస్తాం. అప్పటికీ పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ చేయకపోతే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతాం. నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తాం. రైతులతో కలసి ఉద్యమిస్తాం’’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ‘‘పిక్‌పాకెటింగ్ చేస్తే కేసు పెడతారు. చిట్‌ఫండ్ మోసాలకు పాల్పడితే 420 కేసు పెడతారు.
మరి ఏకంగా ప్రజలను మోసం చేసి సీఎం సీటులో కూర్చున్న మీపై 420 కేసు పెట్టాలా.. 840 కేసు పెట్టాలా? అని రైతుల తరఫున మేం ప్రశ్నిస్తున్నాం’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. చెన్నైలో భవనం కూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన జగన్ గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. రుణాల మాఫీపై ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
రూ.90 వేల కోట్ల రుణాల మాటేమిటి?
‘‘ఎన్నికల సంఘానికి ఏప్రిల్ 11న రాసిన లేఖలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ అబద్ధమే ఆయన్ని సీఎంని చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తన బాధ్యత నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. రుణాలు మాఫీ చేయకుండా దారులు వెదుకుతున్నారు. మాఫీని పక్కనబెట్టి రుణాలు రీషెడ్యూల్ చేస్తామంటున్నారు. అదీ.. రూ. 10 వేల కోట్ల రుణాలు మాత్రమే రీషెడ్యూల్ అంటున్నారు. మిగిలిన రూ.90 వేల కోట్ల గురించి ఏం చెబుతారు’’ అని జగన్ నిలదీశారు. మరోనెల చూస్తామని, ఆ తర్వాత రైతులమంతా ఏకమవుతామని, రైతుల తరఫున వైఎస్సార్ సీపీ పోరాడుతుందని చెప్పారు.
‘కూలి’న బతుకులను నిలబెట్టండి
సాక్షి,శ్రీకాకుళం: ‘‘మా బతుకులు బాగు చేయండి. కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయిన మాకు అండగా నిలబడండి. ఇంటాయన పోయాక పిల్లలు అనాథలుగా మారారు. మాకు న్యాయం చేయండి. ఇక్కడ కూలి దొరక్క చెన్నైకి వలసపోయాం. రాష్ట్రంలో ఉపాధి జాబ్ కార్డులు ఇచ్చినా పని కల్పించడంలేదు.
అందుకే దిక్కులేక పరాయి ప్రాంతాలకు వలసపోతున్నాం’’ అని చెన్నైలో బహుళ అంతస్తుల భవనం, ఆ తర్వాత తిరువళ్లూరులో గోడ కూలిన ఘటనలో మరణించిన వారి కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద కన్నీటి పర్యంతమయ్యాయి. వారి ఆవేదనకు జగన్ చలించిపోయారు. వారికి ధైర్యం చెప్పి, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చెన్నై, తిరువళ్లూరు ఘటనల్లో మృతి చెందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారి కుటుంబాలను జగన్ గురువారం పరామర్శించారు.