పులివెందుల నియోజకవర్గంలో మంగళవారం పర్యటించిన వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రెండు కుటుంబాలను పరామర్శించారు. అలాగే దారిపొడవునా బ్రహ్మరథం పట్టిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు.
పులివెందుల టౌన్, న్యూస్‌లైన్ : పులివెందుల నియోజకవర్గంలో మంగళవారం పర్యటించిన వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రెండు కుటుంబాలను పరామర్శించారు. అలాగే దారిపొడవునా బ్రహ్మరథం పట్టిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు.
స్థానిక జెండామాను వీధిలో నివాసముంటున్న కంచర్ల గంగాధరరెడ్డి సెప్టెంబర్ 7వ తేదీన గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులను మంగళవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. మృతుడి భార్య లక్ష్మిదేవితోపాటు కుమార్తెను వైఎస్ జగన్ ఓదార్చారు. ముందుగా దివంగత సీఎం వైఎస్‌ఆర్, మృతుడు గంగాధరరెడ్డిల చిత్ర పటాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. అలాగే వైఎస్ రాజారెడ్డి వీధిలో నివాసముంటున్న సింహాద్రిపురం మండల వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు కొమ్మా పరమేశ్వరరెడ్డి కుమారుడు భరత్‌కుమార్‌రెడ్డి తలసేమియా వ్యాధితో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో మృతి చెందారు. మంగళవారం రాత్రి పరమేశ్వరరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు.
సిటీ కేబుల్ సూరి ఇంటికి వైఎస్ జగన్ :
వైఎస్‌ఆర్ సిటీ కేబుల్ నెట్‌వర్క్ ఎండీ సూర్యనారాయణ ఇంటికి మంగళవారం సాయంత్రం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లారు. ఇటీవల వివాహం జరిగిన సూరి కుమార్తె భారతి, అల్లుడు అవినాష్‌లను ఆయన ఆశీర్వదించారు.
బలిజ సంఘంలో కేక్ కట్..
వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బలిజ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. నూతన కార్యవర్గ సభ్యులు పరిచయం చేసుకొని అనంతరం వైఎస్ జగన్‌తో క్రిస్మస్ కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో బలిజ సంఘం అధ్యక్షుడు శ్రీపతి చిన్నబాలుడు, ఉపాధ్యక్షుడు సోపాల వీరా, శ్రీనివాసులు, సంఘ పెద్దలు నక్కావెంకటసుబ్బయ్య తదితరులు మాట్లాడారు. పులివెందులలో వైఎస్ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.