నేడు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి,పులివెందుల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం పులివెందులకు రానున్నారు. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన వివరాలను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వివరించారు. వైఎస్ జగన్ గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా పులివెందులకు చేరుకుంటారు. అనంతరం ఉదయం 10గంటల ప్రాంతంలో బద్వేలు బయలుదేరి వెళతారు. అక్కడ నూతన జంట మానస వీణ, సుభోద్‌కుమార్‌రెడ్డిలను ఆశీర్వదించనున్నారు. అనంతరం కొద్దిసేపు నాయకులు, ప్రజలను కలిసి ఆ తర్వాత కడపకు బయలుదేరి వెళ్లనున్నారు. 27, 28 తేదీలలో పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు. అలాగే శనివారం ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించిన అధికారులతోపాటు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో సమీక్షించనున్నారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమాలు ఖరారైనా తర్వాత పరిస్థితిని బట్టి మరికొన్ని కార్యక్రమాలు పొందుపరచనున్నట్లు వైఎస్ అవినాష్‌రెడ్డి సాక్షి ప్రతినిధికి వివరించారు.
ప్రతిపక్ష హోదాలో తొలిసారి
గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నాయకుని హోదాలో పులివెందులకు వచ్చిన ప్రతి సందర్భంలో నాయకులు, కార్యకర్తలతో మమేకమవుతూనే అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించేవారు. అనంతరం వైఎస్‌ఆర్ సీఎం అయిన తర్వాత కూడా పులివెందుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం వైఎస్ జగన్ తొలిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో పులివెందులకు వస్తున్నారు.
ఎన్నికల ఫలితాలు ముగిసిన అనంతరం గతనెల 22వ తేదీన ఇడుపులపాయకు వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు శాసనసభపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే అధికారికంగా శాసనసభలో స్పీకర్ ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొనడంలో భాగంగా వైఎస్ జగన్ ప్రతిపక్షనేత హోదాలో తొలిసారి పులివెందులకు రానున్నారు.
నేడు కడపకు వైఎస్ జగన్
కడప కార్పొరేషన్ : వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ అధినేత, శాసనసభలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గురువారం కడపకు రానున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం బద్వేలులో పర్యటన ముగించుకొని మధ్యాహ్నానికి కడపకు చేరుకుంటారన్నారు. కడపలో సెంట్రల్ జైలు వద్ద ఓ కార్యక్రమంలో పాల్గొని 3.30గంటల నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.