నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్
పులివెందుల/వేంపల్లె, న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తెల్లవారు జామున ఇడుపులపాయకు రానున్నారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా రానున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం వైఎస్ జగన్ ఇడుపులపాయలో తండ్రి వైఎస్‌ఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు. అంతేకాకుండా వైఎస్‌ఆర్ సీపీ శాసనసభ పక్షనేతను సమావేశంలో ఎన్నుకోనున్నారు. అనంతరం 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులతో వైఎస్ జగన్ సమీక్షించనున్నారు.
23న తాత వర్ధంతి వేడుకల్లో వైఎస్ జగన్ :
పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారమంతా ఇడుపులపాయలోనే గడపనున్నారు. గురువారం పులివెందులలో తనను కలిసిన ప్రజలతో మమేకం కానున్నారు. 23న పులివెందులలో వైఎస్ రాజారెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొననున్నారు.
ఇడుపులపాయలో ఏర్పాట్లు :
ఇడుపులపాయలో వైఎస్‌ఆర్ సీపీ శాసనసభ పక్షనేతను ఎన్నుకొనేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇడుపులపాయలోని బయట ఉన్న గెస్ట్‌హౌస్‌లో కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి తాగునీరు, షామియానాలు తదితర ఏర్పాట్లను చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలతోపాటు ఎంపీలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు బుధవారం రానున్న నేపథ్యంలో ఇబ్బందికలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు.