
'హైదరాబాద్ కలిసికట్టుగా నిర్మించుకున్నరాజధాని'
గుడిపాల(చిత్తూరు జిల్లా): 'వచ్చే 10 ఏళ్లలో హైదరాబాద్ ను వదిలి వెళ్లాలంటున్నారు. అది అందరం కలిసి కట్టుగా నిర్మించుకున్న రాజధాని. 50 శాతం బడ్జెట్ ఉన్న హైదరాబాద్ ను వదిలితే సీమాంధ్రలో ఆదాయం పరిస్థితి ఏంటి?'అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్య శంఖారావం సభలో భాగంగా ఆదివారం గుడిపాల బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడిన జగన్.. నీటి కోసం ఎదురు చూస్తున్న ప్రతీ రైతన్న జై సమైక్యాంధ్ర అంటుంటే, ఆ నినాదాలు పాలకులకు వినిపించడం లేదా?అని ప్రశ్నించారు.
కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ ప్రతీ ఒక్కరి మాట జై సమైక్యంధ్రా అంటూ గళమెత్తుతున్నా.. ఆ నేతలకు చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. ఎవర్ని జైల్లో పెడితే, ఎలా విడగోడితే ఓట్లు, సీట్లు వస్తాయని ఆలోచన మాత్రమే చేస్తున్న కాంగ్రెస్ పెద్దలకు బుద్ధి వచ్చే విధంగా ముందుకు వెళదామని జగన్ పిలుపునిచ్చారు. అందరం ఏకమయ్యి, రానున్న ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలను గెలుచుకుందామని ప్రజలకు విన్నవించారు. దివంగత నేత వైఎస్సార్ పేదరికానికి వైద్యం చేసేందుకు ఓ డాక్టర్‌గా ముందుకు వచ్చారని, ఆయన ఉన్నన్నాళ్లు రాష్ట్రాన్ని విడగొట్టే ధైర్యం ఎవరికి రాలేదన్నారు.