
కౌరవ సభను తలపించేలా అసెంబ్లీ: వైఎస్ జగన్
ఎజెండాలో లేకుండా సభలో హఠాత్తుగా బిసి తీర్మానం ప్రవేశపెట్టారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆక్షేపించారు.
కౌరవ సభను తలపించేలా ఏపీ అసెంబ్లీ ఉందని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆక్షేపించారు. ''కౌరవ సభలో ఎలా ఉంటుందో నాకు తెలియదు గానీ.. ఆ సభను మీరు మరిపిస్తున్నారు. న్యాయం లేదు, ధర్మం లేదు. మిమ్మల్ని చూస్తే కౌరవులు కూడా సిగ్గుతో తలదించుకోవాలి. కౌరవులకు క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు, వాళ్ల కంటే అన్యాయంగా ఉన్నారు'' అని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీసీ తీర్మానంపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఎజెండాలో లేకుండా సభలో హఠాత్తుగా బిసి తీర్మానం ప్రవేశపెట్టారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆక్షేపించారు. అలా హఠాత్తుగా బిల్లు పెట్టి చర్చ కోరితే ఎలాగని ఆయన ప్రశ్నించారు. దీంతో మరోసారి ప్రభుత్వం ఎదురుదాడి చేసింది. దాంతో ప్రతిపక్ష నేతకు ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఉంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
అయితే ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడే సభ్యుల జాబితాలో కూడా ప్రతిపక్ష నేత పేరు లేదని స్పీకర్ చెప్పారు. అయినా.. ప్రతిపక్ష నేత మాట్లాడదలిస్తే.. అనుమతిస్తామని స్పీకర్ తెలిపారు. రూల్స్ ప్రకారమే సభలో బిసి తీర్మానం ప్రవేశపెట్టారని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రతిపక్షానికి సమాచారం కూడా ఇచ్చామని తెలిపారు. అయితే తమకు మాట్లాడే అవకాశం ఎందుకివ్వరని ప్రతిపక్ష నేత ప్రశ్నించారు.
ఇంత దారుణమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని వైఎస్ జగన్ ఆక్షేపించారు. బిసిల సంక్షేమంపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. చర్చ ముగించడం ఏమాత్రం సరికాదని ఆయన తేల్చి చెప్పారు. కనీస మానవత్వం మరచిన అధికార పక్షం దారుణంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష నేత ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు.
తాము సభలో ఉండగానే చర్చ ముగిసినట్టు ప్రకటించడం ఎంత వరకు సబబు అనిని ప్రతిపక్ష నేత ప్రశ్నించారు. ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం ఏమాత్రం సరికాదని ఆయన అన్నారు. స్పందించిన స్పీకర్.. ప్రతిపక్ష నేతను గౌరవిస్తామని ఆయన కూడా సభా నియమాలు పాటించాలని సూచించారు.