
సాక్షి, ధర్మవరం : చేనేత, ఇతర వృత్తి పనులు చేస్తూ జీవించే కూలీలకు 45 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ అందిస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పారు. మోసకారి చంద్రబాబు పాలన మరొక్క ఏడాదిలో అంతమైపోయి, జనం కోసం ఏర్పాటయ్యే ప్రజాప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని తెలిపారు. ముడిపట్టు రాయితీ బకాయిల కోసం 37 రోజులుగా దీక్షలు చేస్తోన్న చేనేత కార్మికులకు సంఘీభావం తెలిపేందుకుగానూ మంగళవారం అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి వచ్చిన వైఎస్ జగన్.. అక్కడి జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే...
చివరికి చనిపోయినా పట్టించుకోరా? : ‘‘పట్టువస్త్రాలు, చేనేతకు ఖ్యాతిగాంచిన ధర్మవరంలో గడిచిన 37 రోజులుగా నేతన్నలు నిరాహార దీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఇక్కడ 65 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కనీసం చనిపోయినవారి కుటుంబాలకైనా ప్రభుత్వం సాయం చేయదా! చనిపోయింది 65 మందైదే, జగన్ వస్తున్నాడని ఏదో 11 మందికి, అది కూడా అరకొరగా డబ్బులిచ్చారు. మళ్లీ జగన్ వెళ్లిపోయాక వారిని ఎవరూ పట్టించుకోరు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు నేతన్నలకు పట్టు, నూలు మీద కనీసం రూ.600 ఖర్చులు వచ్చేవి. రెండేళ్ల కిందట చేనేత దినోత్సవంలో చంద్రబాబు మాట్లాడుతూ రూ.600 సాయాన్ని రూ.1000కి పెంచుతామని హామీ ఇచ్చారు. మరి ఇన్ని నెలల్లో ఎన్ని వేలు ఆయన కార్మికులకు ఇచ్చారు? బాబు రావడానికి ముందు 13నెలల బకాయిలు రావాల్సి ఉంది. ఆయన వచ్చాక రెండు నెలపాటు రూ.1000 ఖర్చులిచ్చి ఆ తర్వాత మానేశారు. నిజమే, ఆయనకు అబద్ధాలు చెప్పడం కొత్తేమీకాదు. ఎన్నికలప్పుడు రైతులు, మహిళలు, యువత, చివరికి కులవృత్తులు చేసుకునేవారికి సైతం మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కారు. చేనేత కార్మికుల రుణాలన్నీ మాఫీ చేస్తా, రుణాలు కట్టొద్దు, నేనొస్తున్నాను.. అని ప్రచారం చేయించుకున్నాడు. తీరా అధికారంలోకి వచ్చాక రూ. 390 కోట్ల రుణాలకుగానూ కేవలం రూ.70 కోట్లిచ్చి చేతులెత్తేశారు. నేత కార్మికులకు ఇల్లు కట్టించి, మగ్గం ఏర్పాటుచేస్తామని, ప్రత్యేక నిధి ద్వారా ఏటా రూ.1000 కోట్లు ఖర్చుచేస్తామని, జిల్లాకో చేనేత పార్కు.. అని మోసపూరిత వాగ్ధానాలు చేశారు.
ఏడాది తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే : చేనేత కార్మికులు ఇన్ని అవస్థలు పడుతున్నా.. చంద్రబాబు దున్నపోతు మీద వానపడ్డ చందంగా వ్యవహరిస్తున్నారు. ఆ మోసకారి పాలనకు రోజులు దగ్గరపడ్డాయి. ఒకే ఒక్క సంవత్సరం తర్వాత మనం కలుద్దాం. ఒక్కటిగా మన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకుందాం. దీక్షలు చేస్తోన్న చెల్లెమ్మలకు చెబుతున్నా.. ఒక మంచి అన్నయ్య ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాడు. ఇవాళ రూ.1000 కోసం టెంట్లు వేశారు.. కానీ ప్రతినెలా రూ.2000 వచ్చేలా చేస్తానని హామీ ఇస్తున్నా. చేనేతలు పనిచేస్తే తప్ప కడుపునిండని పరిస్థితి. 45 ఏళ్లకే కీళ్లనొప్పులు మొదలవుతాయి. అందుకే మహానేత రాజశేఖర్‌రెడ్డి వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేశారు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే.. చేనేతలు సహా వృత్తిపనులు చేసుకునే బడుగు కూలీలు అందరికీ 45 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేసుకుందాం. అదికూడా రూ.2000 ఇస్తాం. పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది ఒకటే.. ‘అన్న ముఖ్యమంత్రి అవుతాడు’ అని దేవుణ్ని గట్టిగా ప్రార్థించండి.
చంద్రబాబు అలా చేస్తే అది జగన్‌కే పేరు : మూడున్నరేళ్లుగా చంద్రబాబు మోసపూరిత పాలన చూశారు. కనీసం ఒక్క చేనేత కుటుంబానికి కూడా ఆయన ఇస్తానన్న రూ.1లక్ష రుణం ఇవ్వలేదు. మన ప్రభుత్వంలో మాత్రం ప్రతి కార్మికుడికి ఇంటింటికీ వెళ్లి రుణం అందేలా చూస్తాం. నేను నవరత్నాలను ప్రకటించినప్పుడు కొందరు నాతో అన్నారు.. అన్నా, మనల్ని చూసి చంద్రబాబు కూడా రూ.2000 పెన్షన్ అంటారేమో అని! అందుకు నేనన్నాను..అలా చేస్తే మంచిదేకదా, అవ్వలు, తాతలకు మేలు జరుగుతుంది కదా, పెన్షన్ పెరగడానికి కారణమైనందుకు మనకే పేరొస్తుంది కదా అన్నారు. మీ అందరికీ భరోసా ఇస్తున్నా.. ఇంకొక్క సంవత్సరం వరకు మనం కలిసికట్టుగా పోరాడుదాం. కడుపులో ఎంత బాధున్నా, చిక్కటి చిరునవ్వులు చిందిస్తున్న ప్రతిఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని వైఎస్ జగన్ ప్రసంగాన్ని ముగించారు.
(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలపై వైఎస్ జగన్ నిలదీత
Comments
Please login to add a commentAdd a comment