
సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది ఉగ్రరూపం దాల్చుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు భయం గుప్పిట కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ లంక వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు శుక్రవారం విస్తృత పర్యటన చేపట్టారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా బాధితులకు ఆహార పదార్థాలను అందజేయడమేకాక పునరావాస కేంద్రాలపై దృష్టి సారించారు. వైఎస్సార్‌సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్ వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు.
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కృష్ణలంకలో ఒక రైటనియోగ్ వాల్ నిర్మిస్తామన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌తో సహా, అధికారులు అక్కడిని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వరద మరింత పెరిగే అవకాశం ఉందని, అందువల్ల ముంపు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సహాయక చర్యల కోసం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఐదు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.