‘టీడీపీ అంటే టెంపరరీ డెవలప్‌మెంట్ పార్టీ’
అమరావతి: శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదని... టెంపరరీ డెవలప్‌మెంట్ పార్టీ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని నిర్మాణాలు తాత్కాలికమే అని బుగ్గన అన్నారు. సెక్రటేరియట్ నుంచి ప్రాజెక్టుల వరకూ అన్నీ టెంపరరీ నిర్మాణాలే అని ఆయన ఎద్దేవా చేశారు. వెలగపూడిలో సెక్రటేరియట్ నుంచి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వరకూ అంతా టెంపరరీయే అని అన్నారు. పట్టిసీమకు రూ.1300 కోటర్లు ఖర్చు చేశారని బుగ్గన అన్నారు.
అయితే బుగ్గన మాట్లాడుతుండగానే మైక్ కట్ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్‌ఆర్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ పట్టుబట్టారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బుగ్గన అరవై నిమిషాలు మాట్లాడినప్పటికీ చర్చను ముగించలేదని స్పీకర్ పేర్కొన్నారు. సమయం ముగిసినందునే మైక్ కట్ చేసినట్లు ఆయన తెలిపారు. దయచేసి సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని, సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు.