
కరువు.. చంద్రబాబు అవిభక్త కవలలు
ముఖ్యమంత్రి చంద్రబాబు, కరువు అవిభక్త కవలలని ఆర్.కె.రోజా ఎద్దేవా చేశారు
నందిగామ రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు, కరువు అవిభక్త కవలలని నగరి శాసనసభ్యురాలు ఆర్.కె.రోజా ఎద్దేవా చేశారు. వారి మధ్య విడదీయలేని బంధం ఉందని అన్నారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం కంచికచర్ల మండల పరిధిలోని పలు గ్రామాలలో నియోజకర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారకార్థం ముగ్గుల పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తోందని, నాటి నుంచి రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తోందని చెప్పారు. ఈ పరిస్థితి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలంటూ నానా హడావుడి చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం పూర్తి అసమర్థ పాలన సాగుతోందని చెప్పారు. దివంగత వైఎస్సార్ 90 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభించి, వాటిని తన గొప్పగా చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, ఇక్కడి సమస్యలు పరిష్కరించడం చేతకాని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పులివెందులకు నీరిస్తానని చెప్పడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.