'బాబుకు మహిళల ఉసురు తగులుతుంది'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు రాష్ట్రానికి ఉన్న పరువును, గుర్తింపును కుక్కలు చింపిన విస్తరి చేశారని ఆమె గురువారమిక్కడ మండిపడ్డారు. ఓ వైపు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే...మరోవైపు చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరగడం అవసరమా అని రోజా సూటిగా ప్రశ్నించారు.
పాలన గాలికి వదిలేసిన చంద్రబాబు...రాజధాని భూముల చుట్టూ చక్కర్లు కొడుతున్నారని రోజా విమర్శించారు. మహిళలను కంటతడి పెట్టించిన వారెవ్వరూ బాగుపడరని, చంద్రబాబుకు ఆడవాళ్ల ఉసురు తప్పక తగులుతుందని అన్నారు. రాయలసీమకు గుండెకాయల్లాంటి హంద్రీనీవాను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు రెండుసార్లు అనంతపురం జిల్లాకు వచ్చారని, ఇంతవరకు జిల్లాకు చేసింది ఏమీ లేదని కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా అన్నారు.