నోరుంది కదా అని మైక్ ఇస్తున్నారా?
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం గృహ నిర్మాణంపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీరుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యపై సంబంధిత మంత్రిని మాట్లాడనివ్వకుండా ప్రతి విషయంలోనూ ఆయన జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. ఎవరికీ బుర్ర లేదన్నట్లు ప్రతిదానికి అచ్చెన్నాయుడు లేస్తున్నారు.
నోరు ఉంది కదా అని ఆయనకు మైక్ ఇస్తున్నారా అని రోజా ప్రశ్నించారు. తల్లి కాంగ్రెస్...పిల్ల కాంగ్రెస్ అని ఆరోపించేముందు చంద్రబాబు నాయుడు అమ్మమ్మ కాంగ్రెస్ నుంచి వచ్చిన విషయాన్ని మరచిపోయారా అని ఆమె ఎద్దేవా చేశారు. కార్ల అద్దాలు తెరుచుకుని వెళితే ప్రజల బాధలు ఏంటో తెలుస్తాయన్నారు. గతంలో పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించకుండా పేదవారి జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు.
కాగా ఇళ్ల పేరుతో గతంలో దోపిడీ జరిగిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. గతంలో జరిగిన అక్రమాల వల్లే ఇప్పుడు ఇళ్లను కేటాయించలేకపోతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఆ అవకతవకలపై విచారణ జరిపి ఈ ఏడాది కొత్త ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతిపక్షాలు సిద్ధంగా ఉంటే హౌస్ కమిటీ వేసి గతంలో ఇళ్ల అవకతవకలపై చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో చాలా అవక తవకలు జరిగాయని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై సర్వేపల్లి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ హయాం గురించి మాట్లాడే అర్హత ప్రస్తుత ప్రభుత్వానికి లేదని అన్నారు.