అనంతపురం: హంద్రీనీవా ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై అనంతపురం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు వై విశ్వేశ్వరరెడ్డి, చంద్బాషాలు నిప్పులు చెరిగారు. మంగళవారం అనంతపురంలో వై విశ్వేశ్వరరెడ్డి, చంద్బాషా మాట్లాడుతూ... హంద్రీనీవా ప్రాజెక్టుపై చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హంద్రీనీవా పూర్తి చేస్తే రాయలసీమలో ఆత్మహత్యలు తగ్గుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేస్తానంటున్న చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టుపై ఎందుకు హడావుడి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని వారు చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రాజెక్టు వెంటనే పూర్తిచేయాలన్న డిమాండ్తో జనవరి 28, 29 తేదీల్లో నిరాహారదీక్ష చేస్తున్నట్లు తెలిపారు.
ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 15 రోజులు చాలంటూ ఆర్థిక మంత్రి యనమల పేర్కొనడం దురదృష్టకరమని ఎమ్మెల్యే చాంద్బాషా వ్యాఖ్యానించారు. ఏపీలో రాజధాని నిర్మాణం, రుణమాఫీ, నిరుద్యోగభృతి వంటి అనేక సమస్యలున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు 45 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై సమాధానాలు చెప్పలేక అసెంబ్లీ సమావేశాలను చంద్రబాబు ప్రభుత్వం కుదిస్తోందని చాంద్ బాషా విమర్శించారు.