విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు.. అడుగడుగునా వివక్ష చూపుతున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
విజయనగరం క్రైం: విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు.. అడుగడుగునా వివక్ష చూపుతున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో కొన్ని సార్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మలను వామపక్ష నాయకులు దహనం చేసిన సందర్భాల్లో పోలీసులు అడ్డుకున్నారు. కాని సోమవారం సాయంత్రం పట్టణంలోని మయూరి కూడలి వద్ద వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసినప్పుడు పోలీసులు అడ్డుకోకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో ఎమ్మెల్యేకు లంచం ఇచ్చిన రేవంత్‌రెడ్డి తీరుకు నిరసనగా పార్వతీపురంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. అదే టీడీపీ నేతలు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసినప్పుడు అడ్డుకోకుండా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. పోలీసులు అధికార పక్షానికి తొత్తులుగా మారారన్న విమర్శలు రేగుతున్నాయి. అధికార పార్టీకి ఒక న్యాయమా,,? ప్రతిపక్ష పార్టీలకు మరో న్యాయామా..? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలను నిషేధించినపుడు అన్ని పార్టీల వారినీ సమానంగా చూడాలని, అధికార పార్టీల వారికి తొత్తులుగా మారడం సరికాదని పలువురు హితవు పలుకుతున్నారు.