భద్రాచలం : డబుల్ బెడ్ రూం ఇళ్లలో పాలు పొంగించేందుకు లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పటం లేదు. అన్ని హంగులతో జిల్లాలో 30 కాలనీల నిర్మాణం పూర్తయినా.. వీటిని ప్రారంభించేందుకు అమాత్యులకు తీరిక దొరకటం లేదు. జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాలతో పాటు, వైరాలోని జూలూరుపాడు మండలం (ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నందున)లో మొత్తం 43 చోట్ల మొదటి విడతలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టారు.
ఒక్కో నియోజకవర్గానికి 400 ఇళ్లు కేటాయించారు. మొదటి విడతలో 1298 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించగా. ఇప్పటివరకు 1100 పూర్తయ్యాయి. 198 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తంగా 30 కాలనీలు నిర్మించి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేశారు. కానీ జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వీటి ప్రారంభోత్సవాలకు సమయం కేటాయించకపోవటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రారంభోత్సవాలే ఇలా సా..గుతుంటే తమకు ఇళ్లు ఎప్పుడు కేటాయిస్తారని లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముహూర్తం కుదిరేదెప్పడో...
త్వరలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల ముందు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు తాత్సారం చేస్తున్నారని తెలుస్తోంది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు దీనిని ఉపయోగించుకోవాలని చూస్తున్నారని సమాచారం. ఇందుకోసం పనుల్లో జాప్యం చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై వారు ఒత్తిడి తీసుకొస్తున్నారనే ప్రచారం సైతం ఉంది. ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలంలో మొదటి విడతలో 88 ఇళ్లు కేటాయించగా, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. దసరాకు పాలు పొంగించేలా అధికారులు అంతా సిద్ధం చేసినప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. ముక్కోటి ఉత్సవాలకు ప్రభుత్వ పెద్దలు వస్తారని భావించి, ప్రారంభోత్సవం కోసం హడావిడిగా శిలాఫలకం ఏర్పాటు చేసినా.. ఎంపీటీసీ ఉప ఎన్నికల కోడ్‌తో అది కూడా వాయిదా వేయాల్సి వచ్చింది.
మౌలిక వసతులకు ఇబ్బందులే...
రెండో విడత కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. దీంతో అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లకు గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్ వ్యయం రూ.5.04 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలు, మున్సిపాలిటీల్లో రూ.7 లక్షలు, కార్పొరేషన్ ప్రాంతాల్లో రూ.7.90 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నారు. మొదటి విడత ఇళ్లకు ఆయా కాలనీల్లో మౌలిక వసతుల కోసం ఒక్కో ఇంటికి అదనంగా రూ. 1.25 లక్షలు మంజూరు చేశారు.
ఇంటి నిర్మాణ వ్యయంతో పాటు అదనంగా మంజూరైన రూ.1.25 లక్షలతో ఆయా కాలనీల్లో విద్యుత్, అంతర్గత రహదారులు, తాగునీటి సదుపాయం, డ్రైనేజీల వంటి మౌలిక వసతులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. కానీ రెండో విడత ఇళ్లకు మాత్రం మౌలిక వసతుల కల్పనకు స్థానికంగా అందుబాటులో ఉన్న నిధులను మాత్రమే వినియోగించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది భవిష్యత్‌లో ఇబ్బందికరంగా మారుతుందని అధికారులు సైతం అంటున్నారు.
రెండో విడతకు స్థలం సమస్య...
రెండో విడతలో ఒక్కో నియోజకవర్గానికి 1000 ఇళ్ల చొప్పున మంజూరు చేసింది. త్వరలోనే జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు భారీగానే చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించకపోవటంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖకు మొత్తం 3 వేల ఇళ్ల నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. కొత్తగూడెం పట్టణంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శా>ఖకు అప్పగించారు. కొన్ని చోట్ల ఆర్‌వీఎం, ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ శాఖ పర్యవేక్షణలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. టీడబ్ల్యూ ఇంజనీరింగ్ శాఖకు అప్పగించిన 3000 ఇళ్లలో 2600 గృహాల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఇప్పటికే టెండర్‌ల ప్రక్రియ పూర్తి చేసి, కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్‌లు సైతం సిద్ధం చేశారు.
కానీ జిల్లాలో దాదాపు సగం మండలాల్లో అవసరమైన స్థలాలు కేటాయించలేదు. రెండో విడతలో ఇప్పటివరకు భద్రాచలం మండలం మినహా జిల్లాలో మరెక్కడా పూర్తి స్థాయిలో స్థలాలు గుర్తించలేదు. బూర్గంపాడు, దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో అయితే కనీసం ఒక్కచోటైనా పనులు ప్రారంభించాలని ఇంజనీరింగ్ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నా.. రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆయా మండలాల్లో నెలకొన్న సమస్యపై ఉన్నతాధికారులకు నివేదించేందుకు ఇంజనీరింగ్ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.
స్థలం సమస్యపై నివేదించాం
రెండో విడత ఇండ్ల నిర్మాణానికి స్థలం కేటాయింపుల్లో సమస్య ఉన్న మాట వాస్తవమే. దీనిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము. మొదటిలోని ఇండ్లన్నింటినీ మార్చి నెలాఖరునాటికి పూర్తి చేస్తాం. ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి ప్రారంభోత్సవాలు చేయిస్తాం.
– శంకర్, గిరిజన సంక్షేమ ఈఈ
Comments
Please login to add a commentAdd a comment