మినహాయింపు!
భవన నిర్మాణ నిబంధనల్లో సడలింపు
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు అనుకూలంగా నిర్ణయం
{పభుత్వానికి అధికారుల ప్రతిపాదనలు
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చే క్రమంలో ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఎక్కువ మందికి ఇళ్లు నిర్మించడానికి తగినంత స్థలం అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో బహుళ అంతస్తుల వైపు మొగ్గు చూపుతోంది. దీని కోసం ‘బహుళ’ నిబంధనల్లో మార్పులకు సన్నాహాలు చేస్తోంది. తద్వారా లక్ష్యం సాధించాలని యోచిస్తోంది.
సిటీబ్యూరో: గ్రేటర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి అవరోధాలను తొలగించే దిశగా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ఏడాది జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బహుళ అంతస్తుల్లో నిర్మిస్తేనే తగినన్ని ఇళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. వీటికి కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తొమ్మిది బస్తీల్లో రూ.151 కోట్లతో 2,160 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచి... మూడు పర్యాయాలు గడువు పొడిగించినా ఎవరూ ముందుకు రాలేదు. దాంతో మరోమారు ఈ నెలాఖరు వరకు పొడిగించారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి ప్రత్యేక మినహాయింపులు అవసరమని అధికారులు భావించారు. ఇదే విషయాన్ని ఇటీవల సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో అవసరమైన మేరకు మినహాయింపులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సీఎం సూచించారు. ఆ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అందుకు అనుగుణంగా పేదలకు నిర్మించే బహుళ అంతస్తుల భవనాలకు ప్రత్యేక రెగ్యులేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అవి అమల్లోకి వస్తే ఈ నిర్మాణాలు ముందుకు సాగగలవని భావిస్తున్నారు. ముఖ్యంగా బస్తీల్లో ఇలాంటి నిర్మాణాలకు సెట్‌బ్యాక్‌లు, స్థల విస్తీర్ణం వంటి అంశాల్లో ఉదారంగా వ్యవహరించనున్నారు. ఎక్కువ ప్రాంతాల్లో జీ ప్లస్ 14 అంతస్తుల్లో ఇళ్లు నిర్మించాలని యోచన. ఈ కాంప్లెక్స్‌లలో లిఫ్టులు, కమ్యూనిటీ హాళ్లు, గ్రౌండ్‌ఫ్లోర్‌లో దుకాణాలు, పార్కింగ్ సదుపాయాలు కల్పించే యోచనలో ఉన్నందున మినహాయింపులు ఇవ్వాల్సిందిగా కోరారు. ప్రభుత్వ అనుమతి కోసం చూస్తున్నారు.
నిబంధనల్లో సడలింపు ఇలా..
జీ ప్లస్ 14 అంతస్తుల భవనం నిర్మించేందుకు కనీస స్థల విస్తీర్ణం 2వేల చ.మీ.ల నుంచి 1000 చ.మీ.లకు తగ్గింపు యాక్సెస్ రోడ్డు వెడల్పు 24 మీ. నుంచి 9 మీ.కు తగ్గింపు నాలుగు వైపులా సెట్‌బ్యాక్స్, బ్లాకుల మధ్య దూరం 13 మీ. నుంచి 6 మీ.కు తగ్గింపుపార్కింగ్ ప్రదేశం బిల్టప్ ఏరియాలో 33 శాతం నుంచి 15 శాతానికి తగ్గింపుటాట్‌లాట్ ఏరియా 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు. 2 శాతం స్థలంలో షాపులు, ఇతర సౌకర్యాలు {పస్తుతం ఫైర్ సర్వీసెస్ నుంచి ముందస్తు అనుమతి అవసరం. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు ఫైర్‌సర్వీసెస్ డీజీ ప్రొవిజనల్ ఎన్‌ఓసీ ఇస్తే చాలు.ఇప్పటి వరకూ వైమానిక సంస్థ నుంచి ముందస్తు అనుమతి అవసరం. ‘డబుల్’కు చీఫ్ ఇంజినీర్ ఆన్‌లైన్‌లో పరిశీలించి నివేదిస్తే చాలు. సాధారణంగా 20 వేల చ.మీ. దాటితే పర్యావరణ, అటవీ శాఖల అనుమతి అవసరం. ‘డబుల్’కు అనుమతులిచ్చే కమిటీకి చీఫ్ ఇంజినీర్ నివేదిక చాలు. ఇరుకు ప్రాంతాల్లో ప్రస్తుతం 10 మీ. ఎత్తుకు మించి నిర్మించేందుకు వీలు లేదు. అలాగే హైరైజ్ భవనాల నిషేధిత ప్రాంతాల్లో 18 మీ.కు మించి నిర్మాణానికి వీల్లేదు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు ఇవి వర్తించవు.