మొబైల్‌ యూజర్లు@ 142 కోట్లు! | 5G subscriptions estimated to reach 1.5 billion by 2024: Ericsson Mobility Report | Sakshi
Sakshi News home page

మొబైల్‌ యూజర్లు@ 142 కోట్లు!

Published Wed, Nov 28 2018 1:51 AM | Last Updated on Wed, Nov 28 2018 1:51 AM

5G subscriptions estimated to reach 1.5 billion by 2024: Ericsson Mobility Report  - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్‌ సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 2024 నాటికి 142 కోట్లకు చేరుకోనుంది. అప్పటికి 80 శాతం మంది యూజర్లు 4జీ సేవలను వినియోగించుకునే అవకాశముందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఎరిక్సన్‌ మొబిలిటీ తెలియజేసింది. 2022 నుంచి భారత్‌లో 5జీ సేవలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది. ‘2020 నాటికల్లా 5జీ సర్వీసులను ప్రవేశపెడతామని భారత ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఈ సర్వీసుల వినియోగం 2022 నాటికి గానీ గణనీయ స్థాయికి చేరుకోకపోవచ్చు. 2024 నాటికి 3.8 కోట్ల 5జీ సబ్‌స్క్రిప్షన్స్‌ ఉండొచ్చు. అప్పటి మొత్తం మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్స్‌లో ఈ వాటా సుమారు 2.7 శాతంగా ఉంటుంది‘ అని ఎరిక్సన్‌ మొబిలిటీ రిపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ప్యాట్రిక్‌ సెర్వాల్‌ తెలిపారు. మొబైల్‌ ఫోన్లలో 1 జీబీపీఎస్‌ (గిగాబిట్‌ పర్‌ సెకన్‌) వేగంతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుకోవడానికి 5జీ కనెక్షన్లు తోడ్పడతాయని చెప్పారాయన. ప్రస్తుతం 56 కోట్లుగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ సబ్‌స్క్రిప్షన్స్‌ సంఖ్య మరో ఆరేళ్లలో 100 కోట్లకు చేరగలదని, అలాగే డేటా నెలవారీ వినియోగం 6.8 జీబీ స్థాయి నుంచి 15 జీబీకి పెరగవచ్చని పేర్కొన్నారు.  

150 కోట్ల మంది 5జీ యూజర్లు.. 
2024 ఆఖరు నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు 150 కోట్ల స్థాయిలో 5జీ యూజర్లు ఉంటారని ఎరిక్సన్‌ మొబిలిటీ నివేదిక పేర్కొంది. 5జీ వినియోగంలో ఉత్తర అమెరికా, ఈశాన్య ఆసియా ప్రాంత దేశాలు ముందు వరుసలో ఉంటాయని వివరించింది. భారత్‌లో మరికొన్నాళ్ల పాటు 4జీనే ప్రధాన టెల్కో టెక్నాలజీగా కొనసాగవచ్చని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మూడో త్రైమాసికంలో మొబైల్‌ కనెక్షన్ల సంఖ్య 12 కోట్ల మేర పెరగ్గా.. ఇందులో భారత్‌ వాటా 3.1 కోట్లుగా ఉందని సెర్వాల్‌ తెలిపారు. కొత్త సబ్‌స్క్రయిబర్స్‌ విషయంలో ఎరిక్సన్‌ నివేదిక ప్రకారం 3.7 కోట్ల మంది కొత్త యూజర్లతో చైనా అగ్రస్థానంలో ఉంది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement