అపరాధ రుసుంతో అధిక భారం..
కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రిటర్నులు సకాలంలో దాఖలు చేయని వారికి అపరాధ రుసుం విధిస్తూ ప్రతిపాదనలు చేసింది. దీంతో పన్ను చెల్లింపుదారులపై అదనపు భారం పడనుంది. అదెలాగో చూద్దాం..
ప్రస్తుతం అమల్లో ఉన్నది..
♦ రిటర్నులు గడువు తేదీలోపు దాఖలు చేయాలి.
♦అలా చేయకుండా ఆ తర్వాత చేస్తే... చెల్లించాల్సిన పన్నుపై వడ్డీ విధిస్తారు.
♦ఒకవేళ చెల్లించవలసిన పన్ను లేకపోతే... వడ్డీ పడదు.
♦నష్టం ఉన్న కేసుల్లో సకాలంలో రిటర్నులు దాఖలు చేయకపోతే నష్టాన్ని రాబోయే సంవత్సరానికి బదిలీ చేయరు.
♦పనాల్టీ రూ.5,000 విధిస్తారు.
♦ఎటువంటి అపరాధ రుసుం వసూలు చేయరు.
తాజా ప్రతిపాదనలు ఏం చెబుతున్నాయంటే...
♦ తొలి నాలుగు అంశాల్లో ఎలాంటి మార్పూ లేదు.
♦ ఇక్కడ పెనాల్టీని మాత్రం రద్దు చేస్తున్నారు.
♦ కొత్తగా అపరాధ రుసుం ప్రవేశపెడుతున్నారు.
♦రూ.5,00,000 లోపు ఆదాయం ఉన్న వారికి అపరాధ రుసుం రూ.1,000గా నిర్ణయించారు.
♦ ఇతర కేసుల్లో డిసెంబర్ లోపల దాఖలు చేస్తే రూ.5,000 చెల్లించాలి.
♦ డిసెంబర్ తర్వాత దాఖలు చేస్తే రూ.10,000 చెల్లించాలి.
పైన పేర్కొన్న రెండింటినీ నిశితంగా పరిశీలిస్తే... తాజా ప్రతిపాదనల వల్ల అసెసీకి పన్ను భారం పెరుగుతోంది. సాధారణంగా పెనాల్టీలు విధించరు. పెనాల్టీలు విధించడమన్నది అధికారులకున్న విచక్షణాధికారం మాత్రమే. పన్నులు సకాలంలో చెల్లించి రిటర్నులు ఆలస్యంగా దాఖలు చేసినా.. అదనంగా వడ్డీ చెల్లిస్తూ రిటర్నులు దాఖలు చేసినా.. ప్రభుత్వానికి ఆర్థికపరమైన నష్టం లేదు కాబట్టి అధికారులు పెనాల్టీలు విధించకుండా విడిచిపెడుతున్నారు. అటువంటి విచక్షణాధికారాన్ని తాజా ప్రతిపాదనల ప్రకారం రద్దు చేస్తున్నారు. దాని బదులుగా ఎటువంటి విచక్షణకు/సడలింపునకు ఆస్కారంలేని విధంగా విధిగా ఈ అపరాధ రుసుం విధించబోతున్నారు.
ఈ ఉదాహరణను గమనిద్దాం...
1.4.2017 నుంచి 31.3.2018 వరకు ఒక వ్యక్తి నికర ఆదాయం రూ.3,40,000 అనుకోండి.
► పన్ను భారం రూ.4,500
►రిబేటు రూ.2,500
►చెల్లించవలసిన పన్ను రూ.2,000
► విద్యా సుంకం రూ.60
► బకాయి లేదు
►బకాయి లేనందున ఈ వ్యక్తి రిటర్నులు వేయలేదు.
►కానీ కొత్త రూల్స్ ప్రకారం రూ.1,000 చెల్లించాలి.
ఒక వ్యక్తి నికర ఆదాయం రూ.7,00,000 అనుకోండి.
♦ పన్ను భారం రూ.54,075
♦ టీడీఎస్ రూ.54,075
బకాయి లేనందున లేటుగా వేసిన అదనంగా చెల్లించనవసరం లేదు. కానీ కొత్త ప్రతిపాదనల ప్రకారం జూలై దాటి డిసెంబర్ లోపు అయితే రూ.5,000.. డిసెంబర్ దాటితే రూ.10,000 చెల్లించాలి. ఇది ఎంతో అదనపు భారం. రిటర్నులు ఆలస్యంగా వేసే వారికి శిక్ష. కాగా ఈ ప్రతిపాదనలు అన్నీ 2018–19 అసెస్‌మెంట్ సంవత్సరం నుంచి అమలులోకి వస్తాయి.