100 కోట్ల ఉత్పత్తుల్ని విక్రయిస్తాం: అమెజాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త ఉత్పత్తుల నమోదులో ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ జోష్‌మీద ఉంది. ప్రస్తుతం కంపెనీ 10 కోట్ల ప్రొడక్టులను భారత్‌లో విక్రయిస్తోంది. రోజుకు 2 లక్షల ఉత్పత్తులు తన వెబ్‌సైట్లో నమోదు చేస్తోంది. రానున్న రోజుల్లో 100 కోట్ల ప్రొడక్టుల నమోదుకు ఆస్కారం ఉందని కంపెనీ కేటగిరీ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ మీడియాకు తెలిపారు. బీపీఎల్, వన్ ప్లస్, టీసీఎల్, సాన్యో వంటి కంపెనీలు భారత్‌లో కేవలం అమెజాన్ ద్వారానే మార్కెట్లో విస్తరిస్తున్నాయని చెప్పారు.
1,80,000కుపైగా విక్రేతలు అమెజాన్‌తో చేతులు కలిపారు. విక్రేతలు, తయారీ కంపెనీలు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఆన్‌లైన్ సులువైన మార్గం. మారుమూల ప్రాంతాల్లోనూ ఖరీదైన డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు, పెద్ద టీవీలకు డిమాండ్ ఉంది. డెలివరీతోపాటు ఎక్సే్ఛంజ్ బాధ్యతలనూ తీసుకుంటున్నాం. ఈఎంఐ ఆఫర్ చేస్తున్నాం. ఇలాంటి సౌకర్యాలతో అన్ని కంపెనీల వ్యాపారాలు వృద్ధిలో ఉన్నాయి. మే 11–14 తేదీల్లో గ్రేట్ ఇండియన్ సేల్‌ను నిర్వహిస్తున్నాం. సాధారణ రోజుతో పోలిస్తే సేల్ సమయంలో రెండు రెట్ల అమ్మకాలు నమోదు చేస్తున్నాం’ అని వివరించారు.