
యాపిల్ ‘యాప్’ ఆదాయం.. 20 బిలియన్ డాలర్లు
తన ఫ్లాట్‌ఫామ్‌లోని యాప్ డెవలపర్ల ఆదాయం 2016లో 20 బిలియన్ డాలర్లకుపైగా నమోదయ్యిందని టెక్నాలజీ దిగ్గజ కంపెనీ యాపిల్ పేర్కొంది.
న్యూఢిల్లీ: తన ఫ్లాట్‌ఫామ్‌లోని యాప్ డెవలపర్ల ఆదాయం 2016లో 20 బిలియన్ డాలర్లకుపైగా నమోదయ్యిందని టెక్నాలజీ దిగ్గజ కంపెనీ యాపిల్ పేర్కొంది. 2015తో పోలిస్తే ఇది 40 శాతం అధికమని తెలిపింది. ఇక కొత్త ఏడాది తొలి రోజు యాప్ స్టోర్‌లో కొనుగోలు 240 మిలియన్ డాలర్లుగా ఉన్నాయని పేర్కొంది. రోజు ప్రాతిపదికన చూస్తే ఇవే గరిష్ట కొనుగోళ్లని తెలిపింది.
యాప్ స్టోర్‌ను ప్రారంభించిన దగ్గరి నుంచి (2008) చూస్తే డెవలపర్లు 60 బిలియన్ డాలర్లకుపైగా ఆదాయం పొందారని వివరించింది. ‘చాలా కొత్త కొత్త యాప్స్‌ను రూపొందిస్తున్నందుకు మా డెవలపర్ కమ్యూనిటీకి అభినందనలు తెలుపుకుంటున్నాను. కస్టమర్లకు అనువైన యాప్స్‌ను రూపొందించడం ద్వారా వారి దైనందిన కార్యక్రమాలను సరళతరం చేయవచ్చు’ అని యాపిల్ వరల్డ్‌వైడ్ మార్కెటింగ్ సీనియర్ వైస్–ప్రెసిడెంట్ ఫిలిప్ షిల్లర్ తెలిపారు.
స్టోర్‌లో 22 లక్షలకుపైగా యాప్స్..
దాదాపు 155 దేశాల్లో అందుబాటులో ఉన్న యాప్ స్టోర్‌లో 22 లక్షలకుపైగా యాప్స్ ఉన్నాయని యాపిల్ తెలిపింది. యాప్ స్టోర్ ద్వారా డిసెంబర్‌లో అంతర్జాతీయంగా 3 బిలియన్ డాలర్లమేర కొనుగోళ్లు జరిగాయని పేర్కొంది. ఇదే సమయంలో.. విడుదలైన 4 రోజుల్లోనే 4 కోట్ల డౌన్‌లోడ్లతో సూపర్ మారియో రన్ చరిత్ర సృష్టించిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్, న్యూ ఇయర్ రోజుల్లో అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన యాప్ ఇదేనని పేర్కొంది. ఇక గతేడాది డౌన్‌లోడ్స్‌లో పోక్‌మెన్ గో టాప్‌లో ఉందని తెలిపింది. భారత్‌కు చెందిన డెవలపర్లు కూడా అద్భుతమైన యాప్స్‌ను రూపొందిస్తున్నారని యాపిల్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.