డిసెంబరులోనే అమ్మకాలెక్కువ: మారుతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్ల అమ్మకాలు డిసెంబరులోనే అధికమని మారుతి సుజుకి వెల్లడించింది. ఇతర నెలలతో పోలిస్తే డిసెంబరులో 40-50 శాతం అమ్మకాలు అధికమని కంపెనీ దక్షిణప్రాంత కమర్షియల్ బిజినెస్ హెడ్ రామ్‌సురేశ్ ఆకెళ్ల శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. కంపెనీలిచ్చే ఆఫర్లే ఇందుకు కారణమని చెప్పారు. దీనికితోడు వాహనాల అమ్మకాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 4 శాతం ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు ప్రోత్సాహకం డిసెంబరు 31తో ముగిసే అవకాశం ఉందని వెల్లడించారు.
‘ఏప్రిల్-నవంబరు కాలంలో కార్ల పరిశ్రమ వృద్ధి రేటు 4 శాతం మాత్రమే. మారుతి సుజుకి 13.5 శాతం వృద్ధి నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే సంస్థ మార్కెట్ వాటా 4 శాతం పెరిగి 45 శాతానికి చేరింది. ఇక తెలంగాణ మార్కెట్లో 9%, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో 20% వృద్ధి నమోదు చేశాం’ అని చెప్పారు. విజయవాడ విపణిలో 30% దాకా వృద్ధి ఉందని వివరించారు. కాగా, సెప్టెంబరు 10-అక్టోబరు 23 మధ్య మారుతి సుజుకి సెలబ్రేషన్స్ అన్‌లిమిటెడ్ పేరుతో స్కీమ్‌ను నిర్వహించింది. ఈ కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 8,100 కార్లను కంపెనీ విక్రయించింది. శుక్రవారం నిర్వహించిన బంపర్ డ్రాలో దీపక్ అనే కస్టమర్ సెలెరియో కారును గెల్చుకున్నారు. రామ్‌సురేశ్ ఆకెళ్ల డ్రా తీశారు.