యూనిట్ లింక్డ్ పాలసీల్లో ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ మార్కెట్ పతనాల్లో చేతికి అందేదేమీ ఉండదు. టర్మ్ ప్లాన్లలో తక్కువకే ఎక్కువ పరిహారం వస్తున్నా... చెల్లించిన ప్రీమియం పాలసీదారులు జీవించి ఉంటే వెనక్కి రాదు.
ఒకవేళ పాలసీ కాల వ్యవధిలో దురదృష్టవశాత్తూ మరణిస్తే పరిహారం రావాలి.. లేదా జీవించి ఉన్నా తాము చెల్లించిన మొత్తానికి హామీతో కూడిన రాబడి కలసి అందుకోవాలి. అందుకే వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల్లో అత్యధికులు ఎండోమెంట్ ప్లాన్లకు చోటిస్తుంటారు. ఆకర్షణీయమైన ఎండోమెంట్ ప్లాన్ల వివరాలు చూస్తే...
హెచ్‌డీఎఫ్‌సీ సంచయ్ ప్లస్
పాలసీదారులకు హామీతో కూడిన (గ్యారంటీడ్) రాబడులను ఆఫర్ చేస్తుంది. ఈ పాలసీలో నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. గ్యారంటీడ్ మెచ్యూరిటీ.. అంటే కాల వ్యవధి ముగిసిన తర్వాత హామీ మేరకు చెల్లించేది. గ్యారంటీడ్ ఇన్‌కమ్, లైఫ్‌లాంగ్ ఇన్‌కమ్, లాంగ్‌టర్మ్ ఇన్‌కమ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఐదేళ్ల ప్రీమియం చెల్లించే వ్యవధి ఎంచుకున్న వారికి పదేళ్లకు.. ఆరేళ్లు ప్రీమియం చెల్లింపును ఎంచుకుంటే 12 ఏళ్లకు.. పదేళ్ల ప్రీమియం కాల వ్యవధిని ఎంచుకున్నవారికి 20 ఏళ్లకు హామీ ఇచ్చిన మేరకు ఏక మొత్తంలో కంపెనీ చెల్లిస్తుంది.
గ్యారంటీడ్ ఇన్‌కమ్ ఆప్షన్‌లో.. పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు కంపెనీ నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తుంది. అలాగే, లైఫ్‌లాంగ్ ఇన్‌కమ్‌లో.. పాలసీదారునికి 99 ఏళ్లు వచ్చే వరకు చెల్లింపులు చేస్తుంది. లాంగ్‌టర్మ్ ఇన్‌కమ్ ఆప్షన్‌లో 25 ఏళ్ల పాటు చెల్లింపులు జరుగుతాయి. అన్ని ఆప్షన్లలోనూ పాలసీ కాల వ్యవధి ముగిసిన తర్వాత రెండేళ్ల నుంచి చెల్లింపులు మొదలవుతాయి. పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే.. సమ్ ఇన్సూర్డ్ లేదా అప్పటి వరకు ప్రకటించిన గ్యారంటీడ్ అడిషన్స్‌తో కూడిన మెచ్యూరిటీ ప్రయోజనాలను.. ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 40 ఏళ్ల వ్యక్తికి 5–5.5% మధ్య ప్రస్తుతం ఉంది. ప్రీమియం చెల్లింపు కాలం ఎక్కువ ఉంటే రాబడుల రేటూ ఎక్కువగా వస్తుంది.
ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ ఏఎస్‌ఐపీ
ఇది హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సంచయ్ ప్లస్ మాదిరి ప్లాన్. రెండు రకాల ప్లాన్ ఆప్షన్లను అందిస్తోంది. పదేళ్ల ప్లాన్‌కు ఐదేళ్లు, 15 ఏళ్ల ప్లాన్‌కు ఏడేళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా 60 ఏళ్ల వయసు వరకు పాలసీని తీసుకోవచ్చు. గ్యారంటీడ్ అడిషన్స్, గ్యారంటీడ్ లంప్‌సమ్ మొత్తాన్ని చెల్లిస్తారు. గ్యారంటీడ్ అడిషన్స్ అన్నవి ఏడాదికోసారి పాలసీకి జోడించడం జరుగుతుంది. పాలసీ కాల వ్యవధిని అనుసరించి ఇది ఏటా 10–15% మధ్య ఉండొచ్చు. మరణ పరిహారం సమ్ అష్యూరెన్స్ లేదా గ్యారంటీడ్ మెచ్యూరిటీ ప్రయోజనం ఏది ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. గడువు తీరిన తర్వాత ప్రయోజనం ఏకమొత్తంలో తీసుకునే ఆప్షన్ ఒక్కటే ఉంది. క్రమం తప్పకుండా ఆదాయం కోరుకుంటే తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందే.
ఎస్‌బీఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినా అష్యూర్
50 ఏళ్లు, ఆలోపు వయసున్న ఎవరైనా ఈ ప్లాన్ తీసుకునేందుకు అర్హులే. 12 ఏళ్లు, 15 ఏళ్ల కాల వ్యవధితో వస్తాయి. 12 ఏళ్ల పాలసీకి ఆరేళ్లు, 15 ఏళ్ల పాలసీకి ఏడేళ్లపాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. త్రైమాసికం, అర్ధ సంవత్సరం ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు లేవు. అలాగే, ఈ పాలసీలో కనీస వార్షిక ప్రీమియం రూ.50,000. ఈ పాలసీలో ఇంటర్నల్ రేటు ఆఫ్ రిటర్న్ (ఐఆర్‌ఆర్) 5.5 శాతంగా ఉంది.
ఐసీఐసీఐ లక్ష్య లైఫ్‌లాంగ్
ప్రీమియం చెల్లించిన ఐదేళ్ల తర్వాత నుంచి పాలసీదారులకు ఇందులో ఏటా ఆదాయం లభిస్తుంది. పాలసీదారు మరణించేంత వరకు లేదా 99 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ చెల్లింపులు కొనసాగుతాయి. ఎంత మేర ప్రీమియం చెల్లించడానికి అంగీకారం తెలిపారన్న దాని ఆధారంగా పాలసీ జారీ చేసే సమయంలోనే గ్యారంటీడ్ చెల్లింపులు ఎంత మేర అన్నవి నిర్ణయమవుతాయి. 15 ఏళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌లో 50 ఏళ్ల వయసు వారి వరకే ఈ పాలసీని తీసుకునేందుకు అవకాశం ఉంది. 12 ఏళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌లో ప్రవేశానికి గరిష్ట వయసు 53 ఏళ్లు. అదే విధంగా పదేళ్ల ప్రీమియం ఆప్షన్‌లో గరిష్ట ప్రవేశ వయసు 55 ఏళ్లు.
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సంచయ్ ప్లస్
ఇది కూడా హోల్‌లైఫ్ పాలసీయే. అంటే జీవితాంతం బీమా రక్షణ కల్పించే ఉత్పత్తి. 55–65 ఏళ్ల వయసు వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఎంచుకునే వ్యవధిపై ఇది ఆధారపడి ఉంటుంది. 100లో తమ వయసును తీసివేయగా మిగిలే కాలానికి పాలసీ వర్తిస్తుంది. లేదంటే 30 నుంచి 40 ఏళ్ల కాలానికీ పాలసీని ఎంపిక చేసుకోవచ్చు. ఆరు, ఎనిమిది, పది, పన్నేండేళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్లలో అనుకూలమైనదానిని ఎంచుకోవచ్చు. తక్షణ ఆదాయం (ఇమీడియట్ ఇన్‌మక్), తర్వాత ఆదాయం (డిఫర్డ్ ఇన్‌కమ్) అనే ఆప్షన్లు ఉన్నాయి.
తక్షణ ఆదాయ ఆప్షన్ ఎంచుకుంటే, ఏటా ప్రకటించే బోనస్‌ను చెల్లించడం జరుగుతుంది. గడువు తీరిన తర్వాత జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంకు సమాన మొత్తం ఒకే సారి చెల్లిస్తారు. అదే తర్వాత తీసుకునే ఆదాయ ఆప్షన్‌లో.. హామీతో కూడిన ఆదాయం, క్యాష్ బోనస్‌ను ప్రీమియం చెల్లింపు గడువు తీరిన ఏడాది తర్వాత నుంచి పాలసీ గడువు ముగిసే వరకు చెల్లించడం మొదలవుతుంది. ప్రీమియం చెల్లింపు గడువు తీరిన నాటి నుంచి పాలసీ ముగియడానికి వరకు ఉండే కాలం లేదా 25 ఏళ్లు ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అప్పటి వరకు ఏటా ఈ చెల్లింపులు జరుగుతాయి. గడువు తీరిన తర్వాత సమ్ అష్యూర్డ్, టర్మినల్ బోనస్ చెల్లిస్తారు.
ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్
50 ఏళ్ల వయసు, ఆలోపున్న వారు పాలసీ తీసుకునేందుకు అర్హులు. కనీస పాలసీ కాల వ్యవధి 15 ఏళ్లు. గరిష్టంగా 35 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకోవచ్చు. పూర్తి పాలసీ కాలవ్యవధి వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాక్షిక కాలానికే ప్రీమియం ఆప్షన్ లేదు. పాలసీ అమల్లో ఉన్న కాలంలో మరణం చోటు చేసుకుంటే సమ్ అష్యూరెన్స్ మొత్తాన్ని చెల్లిస్తారు. కాల వ్యవధి తీరే వరకు జీవించి ఉంటే అప్పటి వరకు సమకూరిన బోనస్‌లు అందుకోవచ్చు. అయితే, ఈ పాలసీ కాల వ్యవధి తీరిన తర్వాత కూడా పాలసీదారునికి జీవితాంతం బీమా రక్షణ కొనసాగుతుంది.
అంటే కాల వ్యవధి తీరిన తర్వాత ఒకసారి ప్రయోజనం చెల్లించగా, తిరిగి పాలసీదారు మరణానంతరం నామినీలకు సమ్ అష్యూరెన్స్‌ను చెల్లిస్తారు. ప్రతీ రూ.1,000 సమ్ అష్యూరెన్స్ మొత్తంపై 15 ఏళ్ల కాల వ్యవధి ఎంచుకున్న వారికి 2018–19 సంవత్సరానికి జీవన్ ఆనంద్ పాలసీలో రూ.41ను బోనస్‌గా ప్రకటించారు. 16–20 ఏళ్ల కాల వ్యవధి ఎంచుకున్న వారికి ప్రతీ రూ.1,000 బీమాపై ప్రకటించిన బోనస్ రూ.45. అదే 20 ఏళ్లకు పైగా కాల వ్యవధి కలిగిన పాలసీదారులకు రూ.1,000 బీమాపై రూ.49 బోనస్ అందుకున్నారు.
వీటిని గుర్తుంచుకోవాలి..
ఎండోమెంట్ పాలసీల్లో సరెండర్ చార్జీలు అధికం. అంటే పాలసీదారులు గడువు తీరకుండానే పాలసీని స్వాధీనం చేయాలనుకుంటే నష్టపోయేది ఎక్కువ. అలాగే, పార్టిసిపేటింగ్ ప్లాన్లలో బోనస్‌లకు గ్యారంటీ లేదు. ఎండోమెంట్ ప్లాన్లలో రాబడులు నికర రాబడి రేటు తక్కువే. కానీ, ఇందులో మెచ్యూరిటీ తీరిన తర్వాత చేసే చెల్లింపులపై ఎటువంటి పన్ను ఉండదు. మరణంపై వచ్చే పరిహారానికి కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. కనుక పన్ను ఆదాను పరిగణనలోకి తీసుకుంటే రాబడి రేటు ఫిక్స్‌డ్ డిపాజిట్ల స్థాయిలో ఉంటుందని భావించొచ్చు. బీమా పాలసీలకు చేసే ప్రీమియంను సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా పొందొచ్చు.
ఎండోమెంట్ ప్లాన్లు బీమా.. రాబడి.. రెండూ కావాలంటే!
Published Mon, Mar 30 2020 4:55 AM | Last Updated on Mon, Mar 30 2020 5:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment