డెట్ ఫండ్స్‌లో 5-10 ఏళ్లు ఇన్వెస్ట్ చేయవచ్చా? | Debt funds can invest in 5-10 years? | Sakshi
Sakshi News home page

డెట్ ఫండ్స్‌లో 5-10 ఏళ్లు ఇన్వెస్ట్ చేయవచ్చా?

Published Mon, Dec 8 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM

డెట్ ఫండ్స్‌లో 5-10 ఏళ్లు ఇన్వెస్ట్ చేయవచ్చా?

డెట్ ఫండ్స్‌లో 5-10 ఏళ్లు ఇన్వెస్ట్ చేయవచ్చా?

నేను కొన్ని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. కానీ వీటిపై వచ్చిన రాబడులు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చిన రాబడుల కన్నా స్వల్పమే ఎక్కువ. ఎక్స్‌పెన్స్ రేషియోను కూడా పరిగణనలోకి తీసుకుంటే రాబడులు బాగా తక్కువగా ఉంటున్నాయి. ఎక్స్‌పెన్స్ రేషియోను మినహాయించుకున్న తర్వాతనే మనకు రాబడులను ఇస్తారా? ఈ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను 5-10 ఏళ్లపాటు కొనసాగించవచ్చా? తగిన సమాధానాలు ఇవ్వగలరు.
 - సునయన, విజయవాడ
 
ఫండ్ వ్యయాలను మినహాయించుకున్న తర్వాతనే మ్యూచువల్ ఫండ్ సంస్థలు నెట్ అసెట్ వేల్యూ(ఎన్‌ఏవీ)ను ప్రకటిస్తాయి. మీకు వచ్చే రాబడులు ఎక్స్‌పెన్స్ రేషియోను మినహాయించుకున్న తర్వాత వచ్చినవే. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోల్చితే డెట్ ఫండ్స్‌కు రెండు ప్రధానమైన ప్రయోజనాలున్నాయి. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో స్థిరమైన రాబడి వస్తుంది. అదే డెట్ మ్యూచువల్  ఫండ్స్‌లో అయితే వడ్డీరేట్ల హెచ్చుతగ్గులను బట్టి రాబడులు ఉంటాయి. వడ్డీరేట్ల హెచ్చుతగ్గులు బాగా ఉంటే వీటి నుంచి మంచి రాబడులు వస్తాయి. ఇటీవల కాలంలో ఒక డెట్ ఫండ్ ఏడాదికి 17 శాతం రాబడిని ఇచ్చింది.

డెట్ ఫండ్స్ నుంచి కనిష్టంగా 8.5 శాతం రాబడి పొందవచ్చు. ఇతర స్థిరాదాయ మార్గాలతో పోల్చితే డెట్ ఫండ్స్ మంచి రాబడులనిచ్చే అవకాశాలే ఎక్కువ. ఇక ఓపెన్ ఎండెడ్ డెట్ ఫండ్స్ యూనిట్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించుకోవచ్చు. కానీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోలేం. నిర్ణీత గడువు కన్నా ముందుగానే తీసుకుంటే, కొంత రుసుము చెల్లించాల్సి రావచ్చు. పన్ను పరంగా చూసుకున్నా డెట్ ఫండ్స్ ఉత్తమమైనవి. స్వల్పకాలంలో అధిక రాబడులు, లిక్విడిటీ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే బ్యాంక్ ఎఫ్‌డీల కన్నా డెట్ ఫండ్సే ఉత్తమం.

డెట్ ఫండ్స్‌లో స్వల్పకాలానికే ఇన్వెస్ట్ చేయాలి. డెట్ ఫండ్స్‌లో 5-10 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించడం సరైన పని కాదు. ఐదేళ్లకు మించి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించాలంటే బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ఈ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 65% ఈక్విటీల్లోనూ, మిగిలిన దానిని డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటి నుంచి అధిక శాతం రాబడులు వస్తాయి. పైగా వీటిల్లో ఏడాదికి పైగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తే ఎలాంటి పన్ను పోటు ఉండదు.

నేను ఇప్పటివరకూ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయలేదు. కొత్త ఏడాది నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను.  వచ్చే జనవరి నుంచి ఏదైనా ఒక ఫండ్‌లో సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) విధానంలో మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. విస్తృత అధ్యయనం అనంతరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్, హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్ ఆపర్చునిటీస్, రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్‌ను షార్ట్‌లిస్ట్ చేశాను. కానీ ఈ ఫండ్స్ ఎన్‌ఏవీ (నెట్ అసెట్ వేల్యూ) అధికంగా ఉంది. దేనిని ఎంచుకోవాలో తగిన సూచనలివ్వండి.
 - రుద్ర భూపతి, విజయనగరం
 
మ్యూచువల్ ఫండ్స్‌లో అందునా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నందుకు మీకు అభినందనలు. మీరు షార్ట్‌లిస్ట్ చేసిన ఫండ్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ ఫండ్ ఉత్తమమైనది. మిగిలిన రెండూ మంచి ఫండ్సే కానీ, మూడేళ్ల ఇన్వెస్ట్‌మెంట్ కాలానికి, మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో అడుగిడుతున్న మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ ఫండ్ అనువైనది. ఇక ఎన్‌ఏవీ అధికంగా ఉందని రాశారు. ఇది అసలు సమస్యే కాదు.  ఒక మ్యూచువల్ ఫండ్ గతంలోని పనితీరు ఇప్పటి పనితీరు పోల్చడానికి ఎన్‌ఏవీ పనికి వస్తుంది. ఎన్‌ఏవీ తక్కువగా ఉంటే ఎక్కువ యూనిట్లు, ఎన్‌ఏవీ ఎక్కువగా ఉంటే యూనిట్లు తక్కువగా వస్తాయి. కానీ ఇన్వెస్ట్‌మెంట్ విలువ ఒక్కలాగే ఉంటుంది. ఎన్‌ఏవీని బట్టి కాకుండా ఫండ్ పనితీరును బట్టి ఇన్వెస్ట్ చేయాలి.

నేరుగా ఈక్విటీల్లో (షేర్లు) ఇన్వెస్ట్ చేయడం మంచిదా లేకుంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా?     - కమలాకర్, నిజామాబాద్

మ్యూచువల్ ఫండ్స్ వార్షిక వ్యయాలను మినహాయించుకొని రాబడులను అందిస్తాయి. ఈ వార్షిక వ్యయాలు 1-2% రేంజ్‌లో ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం కంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రాబడులు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. నిపుణులైన ఫండ్ మేనేజర్లు మ్యూచువల్ ఫండ్‌లను నిర్వహించడమే దీనికి కారణం. నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి విస్తృతమైన పరిజాఞనం అవసరం. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీ ఏ రంగంలో ఉంది?

ఎలాంటి ఉత్పత్తులు, సేవలు అందిస్తోంది? వాటికి మార్కెట్లో స్పందన ఎలా ఉంది? ప్రమోటర్ల ట్రాక్ రికార్డ్.. ఇలాంటి పలు అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదే ఏదైనా మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే వీటన్నింటినీ చూడ్డానికి నిపుణులైన వ్యక్తులు ఉంటారు. మీకు తగిన సమయం, ఓపిక ఉంటే కంపెనీకి సంబంధించి అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించి ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement