డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలకు 3–4 ఫండ్స్‌ చాలు | Diversification benifits to 3-4 funds | Sakshi
Sakshi News home page

డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలకు 3–4 ఫండ్స్‌ చాలు

Published Mon, May 28 2018 1:08 AM | Last Updated on Mon, May 28 2018 1:08 AM

 Diversification benifits to 3-4 funds  - Sakshi

నేను సీనియర్‌ సిటిజన్‌ను. మంచి డివిడెండ్ల కోసం పెద్ద మొత్తంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి.   – ఆనంద రావు, వరంగల్‌  
మ్యూచువల్‌ ఫండ్‌ రాబడులు డివిడెండ్ల రూపంలోనే పొందాలనే భావన నుంచి బయటకు రండి. సీనియర్‌ సిటిజన్‌ల విషయంలో పన్ను ప్రయోజనాలు అత్యంత కీలకమైన అంశం. మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడుల విషయమై ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రధానమైన మార్పులు జరిగాయి. ఈక్విటీ ఫండ్స్‌పై వచ్చే డివిడెండ్‌లు, మూలధన లాభాలపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఇన్వెస్ట్‌ చేసిన ఫండ్‌ మీకు రూ.10 డివిడెండ్‌ ఇచ్చిందనుకోండి.

పన్ను భారం పోను మీకు నికరంగా వచ్చే డివిడెండ్‌ రూ.9 మాత్రమే. దీనికంటే, సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌(ఎస్‌డబ్ల్యూపీ) అనుసరించడం ఉత్తమం. మరొక్క విషయం మీరు ఎప్పుడూ ఒకేసారి పెద్ద మొత్తంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయకూడదు. మార్కెట్‌ గరిష్ట స్థాయిల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేస్తే మీకు నష్టభయం అధికంగా ఉంటుంది.

మీ దగ్గరున్న మొత్తాన్ని కనీసం 12–24 భాగాలుగా చేసి నెలకు ఒక భాగం చొప్పున ఇన్వెస్ట్‌ చేయాలి.  మీకు పెన్షన్‌ వస్తున్నట్లయితే, మీకు మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి తక్కువ నెలవారీ ఆదాయం వస్తే సరిపోతుంది. మీకు ఎలాంటి పెన్షన్‌ ఆదాయం లేనప్పుడు...  మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి పెద్ద మొత్తమే మీకు నెలవారీ ఆదాయంగా అవసరమవుతుంది. మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న మొత్తంలో ఏడాదికి 5 శాతం చొప్పున విత్‌డ్రాయల్‌ చేసుకునేలా మీ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ ఉండాలి.  

నేను గత కొంత కాలంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో 4–5 ఫండ్స్‌ మాత్రమే ఉన్నాయి. డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాన్ని మరింతగా పెంచుకోవడానికి  ఫండ్స్‌ సంఖ్యను మరింతగా పెంచుకోవాలా ? – ప్రగతి, విశాఖపట్టణం  
మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి డైవర్సిఫికేషన్‌ అత్యంత ముఖ్యమైన విషయం. నష్టభయాన్ని తగ్గించడంలో డైవర్సిఫికేషన్‌ కీలకమైన పాత్ర పోషిస్తుంది. డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాల కోసమే అసలు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తారు. అయితే ఒక స్థాయికి మించిన తర్వాత డైవర్సిఫికేషన్‌తో ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పవచ్చు. మరీ మితి మీరితే అది డై–వరస్ట్‌(అధ్వాన)–ఫికేషన్‌ అవుతుంది. డైవర్సిఫికేషన్‌ మితిమీరితే మీ పోర్ట్‌ఫోలియో పనితీరు పేలవంగా ఉండే అవకాశాలూ ఉండొచ్చు.

మీ పోర్ట్‌ఫోలియోలో ఇప్పుటికే ఐదు మ్యూచువల్‌ ఫండ్స్‌  ఉన్నాయి. డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పొందడానికి ఈ ఫండ్స్‌ సరిపోతాయి. మీరు ఇన్వెస్ట్‌ చేయబోయే కొత్త ఫండ్‌ పూర్తిగా ప్రత్యేకమైనదై ఉండాలి. అలా ఉంటేనే కొత్త ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. మూడు మల్టీక్యాప్‌ ఫండ్స్, నాలుగు స్మాల్‌–క్యాప్‌ ఫండ్స్‌ ఉన్నా కూడా మంచి డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పొందవచ్చు.

  పన్ను మదింపు పరంగా చూసినప్పుడు...మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఎప్పుడూ సరళంగా ఉండాలి. ఫండ్స్‌ ఎక్కువైన కొద్దీ, ఫీజులు కూడా ఎక్కువగా ఉంటాయి. మరోవైపు  పన్ను మదింపు గందరగోళంగా మారే అవకాశాలూ ఉంటాయి. అందుకని మీ పోర్ట్‌ఫోలియోలో విభిన్నమైన మ్యూచువల్‌ ఫండ్స్‌ 4–5 ఉంటే చాలు. డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు బాగానే పొందవచ్చు.  
డెట్‌ పోర్ట్‌ఫోలియోలో ఎండోమెంట్‌ ప్లాన్‌లు ఒక భాగంగా తప్పనిసరిగా ఉండాలా ? స్థిరాదాయాన్ని ఇచ్చే సాధానాలకు ప్రత్యామ్నాయంగా ఎండోమెంట్‌ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం సరైన నిర్ణయమేనా?     – గోపాల్, విజయవాడ  
మీరు చెల్లించే ‘ధర’ను పరిగణనలోకి తీసుకుంటే, ఎండోమెంట్‌ ప్లాన్‌ల్లో వచ్చే రాబడి తక్కువగా ఉంటుంది. ఈ దృష్ట్యా స్థిరాదాయ సాధనాలకు ప్రత్యామ్నాయంగా ఎండోమెంట్‌ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. అయితే మీరు ఇప్పటికే ఎండోమెంట్‌ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసి ఉన్నా, మీరు ఇన్వెస్ట్‌ చేసిన ఎండోమెంట్‌ ప్లాన్‌లు సమీప భవిష్యత్తులో మెచ్యూర్‌ అవుతున్నా, మరే ప్రత్యేక కారణాల వల్ల  ఈ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసి ఉన్నా,.. డెట్‌ పోర్ట్‌ఫోలియోలో ఒక భాగంగా ఎండోమెంట్‌ ప్లాన్‌లను పరిగణించవచ్చు.  

నిర్వహణ ఆస్తులు అధికంగా ఉన్న మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడులు కూడా అధికంగా ఉంటాయా ? లేక నిర్వహణ ఆస్తులు తక్కువగా ఉన్న మంచి పనితీరు ఉన్న మ్యూచువల్‌ ఫండ్‌కు మారిపోమంటారా?     – జబ్బార్, హైదరాబాద్‌  
మ్యూచువల్‌ ఫండ్స్‌.. ఏ కేటగిరికి చెందినవనే అంశాన్ని బట్టి దాని నిర్వహణ ఆస్తులు (ఏయూఎమ్‌– అసెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌) కీలకమవుతాయి. ఉదాహరణకు లిక్విడ్‌ ఫండ్స్, స్వల్పకాలిక డెట్‌ ఫండ్స్‌ విషయానికొస్తే, అధిక ఏయూఎమ్‌ ఉన్న ఫండ్స్‌ మంచి రాబడులను ఇచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. లార్జ్, మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ ఏయూఎమ్‌లు అధికంగా ఉన్నా కూడా  ఆ ఫండ్స్‌ పనితీరు బాగా ఉంటుంది.

మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ ఏయూఎమ్‌లు పెరుగుతున్న కొద్దీ, వాటి పనితీరు కొద్దిగా మందగించే అవకాశాలున్నాయి. మిడ్‌ క్యాప్‌ ఫండ్‌గా మొదలైన ఒక ఫండ్‌ ప్రస్థానం ఆ తర్వాత ఏయూఎమ్‌లు అధికంగా పెరగడంతో లార్జ్‌ క్యాప్‌కు ఎదిగింది. ఇలాంటి ఫండ్స్‌ తక్కువగానే ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న ఫండ్‌ ఏ కేటగిరీ కిందకు వస్తుందో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోండి.


ధీరేంద్ర కుమార్‌
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement