
ముఖ్యమంత్రి కాదు.. ఆర్‌బీఐ చెప్పాలి
రుణమాఫీ పథకం అమలు చేసే అవకాశం లేదంటున్నారు ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్. రాజేంద్రన్.
* రుణమాఫీ అధికారం రాష్ట్రాలకు లేదు
* రుణాలు రీ షెడ్యూల్ చేయమని ప్రభుత్వాలు అడగలేవు
* రుణాలు రీ షెడ్యూల్ చేస్తే 10 శాతం వడ్డీ చెల్లించాలి
* బాండ్లు జారీ చేసే ఆర్థిక స్తోమత ఏపీకి లేదు
* ఆర్థిక పరిస్థితులు తెలుసుకోకుండా మాఫీ హామీ ఎలా ఇచ్చారో
* ప్రభుత్వ నిర్ణయం జాప్యమయ్యేకొద్దీ డిఫాల్టర్లు పెరుగుతారు
* ఇప్పటికే ఆంధ్రాబ్యాంకులో ఎన్‌పీఏలుగా మారిన రూ. 1,000 కోట్ల రైతు రుణాలు
* ప్రభుత్వ పాలసీ త్వరగా రాకపోతే 11,000 కోట్లు ఎన్‌పీఏలే
* రుణమాఫీ అంశంలో తెలంగాణ పరిస్థితి కొంత మెరుగు
ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్. రాజేంద్రన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలోని ఆర్థిక స్థితిగతులను తెలుసుకోకుండా ఇచ్చిన హామీలు బ్యాంకింగ్ రంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌బీఐ అనుమతి లేనిదే రుణమాఫీ పథకం అమలు చేసే అవకాశం లేదంటున్నారు ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్. రాజేంద్రన్.
ఒకవేళ రుణాలను రీ-షెడ్యూల్ చేస్తే వ్యవసాయ రుణాలపై లభిస్తున్న సబ్సిడీ వర్తించదంటున్న రాజేంద్రన్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ రుణాలను రీ-షెడ్యూల్ చేయమని కోరుతోంది కదా? ఇందులో సాధ్యాసాధ్యాలు వివరిస్తారా?
రుణాలను రీ-షెడ్యూల్ చేయమని బ్యాంకులను అడిగే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. కేంద్రం కేవలం కరువు మండలాలను మాత్రమే ప్రకటించగలదు. కానీ ఆ విషయంలో ప్రభుత్వం విఫలమయ్యింది. ఇప్పుడు రాష్ట్రంలో రుణాలను రీ-షెడ్యూల్ చేయాలంటే ఆర్‌బీఐ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ అనుమతిస్తే చేయడానికి మేం సిద్ధం. ఆర్‌బీఐ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం. అంతే తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారని రీ-షెడ్యూల్ చేయలేం.
రీ-షెడ్యూల్ కోసం రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అనుమతి కోరమని ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బ్యాంకులకు విజ్ఞప్తిచేశారు కదా?
ఈ విషయంలో బ్యాంకులు నేరుగా కల్పించుకోలేవు. ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో జరిగిన మినిట్స్‌ను ప్రాంతీయ ఆర్‌బీఐ కార్యాలయం కేంద్ర కార్యాలయానికి పంపుతుంది. త్వరలోనే ఆర్‌బీఐ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది.
రుణాలను రీ-షెడ్యూల్ చేస్తే వ్యవసాయ రుణాలకు లభించే 3 శాతం వడ్డీ ప్రయోజనం కొనసాగుతుందా? అలాగే కొత్త రుణాలను మంజూరు చేస్తారా?
ఒకవేళ రుణాలు రీ-షెడ్యూల్ చేస్తే ఆ రుణాలపై 7 శాతానికి బదులు 10 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రీ-షెడ్యూల్‌కు ఆర్‌బీఐ అనుమతిస్తే ప్రస్తుత పంటకు కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. లేదా రుణాలు చెల్లించిన వారికి కూడా కొత్త రుణాలను మంజూరు చేస్తున్నాం.
ఇలా పెరిగిన వడ్డీ రేటును రైతులే భరించాల్సి ఉంటుందా? లేదంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా?
వాస్తవంగా అయితే ప్రభుత్వం చెల్లించాలి. కానీ దీనిపై స్పష్టత లేదు. అసలు రుణమాఫీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా ప్రకటించే అధికారం లేదు. ప్రభుత్వం దగ్గర నిధులు ఉంటే అప్పుడు రైతుల తరఫున రుణం చెల్లించే విధంగా హామీ ఇవ్వొచ్చు. రుణ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించకుండా ఇతర మార్గాలను అవలంబించాల్సి వస్తే మాత్రం ఆర్‌బీఐ అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిందే.
రుణ వసూళ్ల కోసం రైతుల మీద ఏమైనా ఒత్తిడి చేస్తున్నారా? చెల్లించని వారిని డిఫాల్టర్లుగా ప్రకటిస్తున్నారా?
ఎటువంటి ఒత్తిడి తీసుకురావడం లేదు. రాజకీయంగా ఒత్తిడి ఉండటం, రైతులు ఆందోళన చేస్తుండటంతో చెల్లించని వారిపై ఎటువంటి రికవరీ చర్యలు తీసుకోలేకపోతున్నాం. తమ రుణాలను ప్రభుత్వం చెల్లిస్తుందని రైతులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే ఒక స్పష్టత తీసుకురావాలి. జూన్ నెలలోనే చాలా మంది రైతుల్ని డిఫాల్టర్లుగా ప్రకటించాం. ఆలస్యం అయ్యేకొద్దీ ఈ జాబితా పెరుగుతుంది. గడచిన త్రైమాసికంలో ఆంధ్రాబ్యాంక్‌కు సంబంధించి రూ.1,000 కోట్ల వ్యవసాయ రుణాలు ఎన్‌పీఏలుగా మారాయి. ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని ఆలస్యం చేస్తే మిగతా రూ.11,000 కోట్ల వ్యవసాయ రుణాలు కూడా ఎన్‌పీఏగా మారే అవకాశం ఉంది. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం.
ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌గా రుణ మాఫీ పథకానికి సంబంధించి ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేశారా?
చేయాలనుకుంటున్న రుణమాఫీ మొత్తం, కటాఫ్ తేదీపై (రుణ మాఫీ లేదా రీషెడ్యూల్‌కు అర్హులైన రైతుల గుర్తింపునకు వర్తింపచేసే నిర్ణీత తేదీ) ముందు స్పష్టత తెచ్చుకోమని సూచించాం. అప్పుడు ఎంత మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుందన్న దానిపై అవగాహన వస్తుంది. ఈ రుణమాఫీ పథకం పరిధిలోకి వచ్చే రైతులు వారి బకాయిల్ని ముందుగా చెల్లిస్తే కొత్త రుణాలను ఇస్తాం.
అప్పుడు రైతులు బ్యాంకుకు చెల్లించిన సొమ్మును ప్రభుత్వం రైతులకే నేరుగా చెల్లించుకోవచ్చు. రైతు చెల్లించిన రుణానికి సంబంధించి మేము ప్రభుత్వానికి సర్టిఫికెట్ రూపం లో ఇస్తామన్నాం. ఈ సర్టిఫికెట్‌ను పరిశీలించుకొని ప్రభుత్వం రైతులకు ఐదేళ్ల లోపు చెల్లించుకోవచ్చు. అప్పుడు ఇది రైతులకు, ప్రభుత్వానికి మధ్య కుది రిన ఒప్పందమవుతుంది.దీనికి ఆర్‌బీఐ అనుమతులు అవసరం లేదు. కానీ ఇక్క డ ప్రభుత్వం గ్యారంటీగా రైతులకి చెల్లిస్తామన్న హామీ ఉండదు. ఇది పూర్తిగా ప్రభుత్వం, రైతులకు మధ్య ఉన్న నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది.
చెల్లించాల్సిన రుణ బకాయిలకు సంబంధించి బ్యాంకులకు రాష్ర్ట ప్రభుత్వం బాండ్లు జారీ చేసే ఆలోచనలో ఉందన్న ప్రచారంలో ఉంది కదా?
ఇది కూడా సాధ్యమయ్యేపని కాదు. ఇందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్ట ప్రకారం జీడీపీలో 3 శాతానికి మించి రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయడానికి లేదు. ఈ విధంగా చూస్తే రూ.13,000 కోట్లు మించి ఆంధ్రప్రదేశ్ అప్పులు చేయడానికి లేదు. అలా అప్పు చేసిన నిధులు ప్రభుత్వం నడవడానికే చాలా అవసరం. కాబట్టి బాండ్లను జారీ చేసే అవకాశం కూడా లేదు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా ఇంత పెద్ద హామీలను ఏ విధంగా ఇచ్చారో తెలియడం లేదు. గతంలో అంత ఆదాయం ఉన్న కేంద్ర ప్రభుత్వమే దేశమంతటా రూ.60,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తే ఒక్క రాష్ట్రం రూ.50,000 కోట్ల రుణాల మాఫీ హామీని ఎలా ఇచ్చారో.., దీన్ని ప్రజలు ఎలా నమ్ముతున్నారో అర్థం కావడం లేదు. కానీ ఈ హామీ ప్రభావం ఆంధ్రాబ్యాంక్, ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.
రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాల మొత్తంపై భిన్నమైన గణాంకాలు ప్రచారంలో ఉన్నాయి. వాస్తవంగా రాష్ట్రంలో వ్యవసాయ రుణాల విలువ ఎంత ఉంటుంది?
గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న మొత్తం వ్యవసాయ రుణాల విలువ రూ.1.30 లక్షల కోట్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.77 వేల కోట్లపైనే ఉంది. మాకొస్తున్న సమాచారం ప్రకారం రెండు రాష్ట్రాల్లో కలిపి అర్హులుగా గుర్తించే రైతులకు రూ.55,000 కోట్ల రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.35,000 కోట్లు కాగా, తెలంగాణ వాటా రూ.20,000 కోట్లుగా ఉన్నట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాల అంచనా. ఏ పరిమితులు ఆధారంగా ఈ గణాంకాలు తయారు చేశారో తెలియదు. ఈ ప్రకారం చూస్తే ఆంధ్రాబ్యాంక్ సుమారు రూ.11,670 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుంది. ఇందులో తెలంగాణ వాటా రూ.4,557 కోట్లు.
రుణ మాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది?
బ్యాంకుల నుంచి సమాచారం తీసుకున్నారే కాని ఇంతవరకు ఎటువంటి ప్రతిపాదనలు రాలేదు. కాని ఆంధ్రప్రదేశ్ రాష్టంతో పోలిస్తే రైతులు తీసుకున్న రుణాల విలువ తక్కువగా ఉండటం, మిగులు బడ్జెట్‌ను కలిగి ఉండటంతో తెలంగాణ రాష్ట్రం కొద్దిగా మెరుగైన పరిస్థితిలో ఉందని చెప్పొచ్చు.