మీడియా సమావేశంలో కవితా దత్, అపర్ణారెడ్డి, పద్మా రాజగోపాల్, జ్యోత్స్న, దేవేంద్ర సురానా (ఎడమ నుంచి కుడికి)
పటాన్‌చెరు వద్ద 50 ఎకరాల్లో ఏర్పాటు: టీఎస్‌ఐఐసీ సహకారం...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ దేశంలో తొలిసారిగా హైదరాబాద్ వద్ద ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తోంది. పటాన్‌చెరు సమీపంలోని సుల్తాన్‌పూర్ వద్ద 50 ఎకరాల్లో దీనిని నెలకొల్పుతున్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌వో) హైదరాబాద్ చాప్టర్, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నాయి. ఒక్కో ఎకరాకు టీఎస్‌ఐఐసీ రూ.45 లక్షలు వసూలు చేస్తుంది.
పార్కును ఏర్పాటు చేయాలని గత మూడేళ్ల నుంచి ఎఫ్‌ఎల్‌వో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ పార్కులో 3-5 ఏళ్లలో రూ.200 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ చాప్టర్ చైర్‌పర్సన్ పద్మా రాజగోపాల్ తెలిపారు. 3-4 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఎఫ్‌ఎల్‌వో ప్రతినిధులు అపర్ణా రెడ్డి, కవితా దత్ చిట్టూరి, జ్యోత్స్న అంగారా, ఫిక్కీ తెలంగాణ చైర్మన్ దేవేంద్ర సురానా, టీఎస్‌ఐఐసీ జనరల్ మేనేజరు శ్రీకాంత్‌రెడ్డితో కలిసి బుధవారమిక్కడ మీడియాతో ఆమె మాట్లాడారు.
సభ్యులకు మాత్రమే..
బెంగళూరు, లుథియానా, ఇండోర్ చాప్టర్లు సైతం ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకున్నాయని పద్మ రాజగోపాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. అన్నిటికంటే ముందుగా హైదరాబాద్ చాప్టర్ పార్కును నెలకొల్పుతోందని గుర్తు చేశారు. ఇక హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎల్‌వో ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఇండస్ట్రియల్ పార్కులో కేవలం సభ్యులకు మాత్రమే అవకాశం కల్పిస్తామన్నారు.
‘‘ఇక్కడ పర్యావరణానికి హాని కలిగించని కంపెనీలు మాత్రమే ఏర్పాటవుతాయి. యూనిట్ల స్థాపనకు ఇప్పటికే 36 దరఖాస్తులొచ్చాయి. ఇవన్నీ కూడా హైదరాబాద్ చాప్టర్ సభ్యుల నుంచే వచ్చాయి’’ అన్నారామె. దేశవ్యాప్తంగా ఉన్న ఎఫ్‌ఎల్‌వో చాప్టర్ల సభ్యులకు కూడా ఈ పార్కులో అవకాశం కల్పిస్తారు.
పార్కులో మౌలిక సదుపాయాలను టీఎస్‌ఐఐసీ కల్పిస్తోంది. మహిళా పారిశ్రామికవేత్తలకు వర్తించే రాయితీలు ఉంటాయి. అనుమతి పొందిన రెండేళ్లలో యూనిట్‌ను ప్రారంభించాలన్న నిబంధన ఉంది.