
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోసారి సహజవాయువు ధరను పెంచేసింది. చమురు మంత్రిత్వ శాఖలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సహజ వాయువు ధర 6శాతం పెరిగింది. దీంతో సహజవాయువు ధర రెండేళ్ల గరిష్టానికి చేరింది. ఈ చర్య మూలంగా సీఎన్‌జీ, పీఎన్‌జీ పైప్డ్ వంటగ్యాస్ ధరలు భారీగా పెరగనున్నాయని విశ్లేషకుల అంచనా.
తాజా పెంపుతో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంఎంబీటీయూ) ధర 3.06 డాలర్లు చొప్పున పెరగనుంది. ధరలు పెంచకముందు ఇది 2.89 డాలర్లుగా ఉంది. సవరించిన ధరలు ఏప్రిల్ 1నుంచి అమల్లోకి రానున్నాయి. ఆరు నెలల పాటు అక్టోబర్ దాకా ఈ ధరలు అమల్లో ఉంటాయి. అధిక లోతు, అధిక వేడి, అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుంచి వెలికితీసే గ్యాస్ ధరను 9 శాతం అంటే ఎంఎంబీటీయూకు 6.78 డాలర్ల చొప్పున పెంచింది. దేశీయ గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ధర కూడా 3శాతం పెరగనుంది. అలాగే సీఎన్‌జీ, వంటగ్యాస్ లు ధరలు 50-55 పైసలు , స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కు 35-40 పైసలు పెరగనున్నట్టు అంచనా.
మరోవైపు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో సహజ వాయువును ఉత్పత్తి చేస్తున్న ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లాంటి సంస్థలకు భారీగా లబ్ధి చేకూరనుంది. కాగా అమెరికా, రష్యా , కెనడా వంటి గ్యాస్ మిగులు దేశాలలోని సగటు రేట్లు ఆధారంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి సహజ వాయువు ధరల సమీక్ష ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment