
సాక్షి, న్యూఢిల్లీ : అత్యధిక జీఎస్టీ శ్లాబు 28 శాతం అమలవుతున్న ఉత్పత్తులకు మంచి రోజులు రాబోతున్నాయి. ఎక్కువగా వినియోగించే ఉత్పత్తులకు, నాన్-లగ్జరీ ఉత్పత్తులకు ఈ రేటును తగ్గించాలని పాలసీ తయారీదారులు నిర్ణయిస్తున్నారు. వీటిని 18 శాతం పన్ను శ్లాబులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. వీటికి మరింత డిమాండ్‌ను పెంచడానికి ఈ ఉత్పత్తుల ధరలు తగ్గించాలని చూస్తున్నారు. 28 శాతం శ్లాబును పునఃసమీక్షించాల్సి ఉందని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి చెప్పారు. ఎక్కువ మొత్తంలో పన్ను రేట్లు భరిస్తున్న కొన్ని ఉత్పత్తులను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలే తయారీ చేస్తుండటంతో, వీరిపై ఒత్తిడి అధికంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పన్ను రేట్లను పునఃసమీక్షించాల్సి ఉందని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
28 శాతం పన్ను శ్లాబులో వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రిక్ ఫిట్టింగ్స్, సిమెంట్ సీలింగ్ ఫ్యాన్స్, వాచ్‌లు, ఆటోమొబైల్స్, టుబాకో ఉత్పత్తులు, న్యూట్రిషినల్ డ్రింకులు, ఆటో పార్ట్‌లు, ప్లాస్టిక్ ఫర్నీచర్, ప్లేవుడ్‌లున్నాయి. పాలసీ తయారీదారులు ప్రస్తుతం తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించాల్సి ఉంది. నవంబర్ 9-10వ తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ గౌహతిలో భేటీ కాబోతుంది. ఈ భేటీలో ఈ అంశాలు చర్చకు రానున్నాయి. 28 శాతం పన్ను శ్లాబు అనేది నిజమైన జీఎస్టీ విధానానికి, లక్ష్యానికి విఘాతం కల్గిస్తుందని ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫిడరేషన్ విమర్శిస్తోంది. లగ్జరీ ఉత్పత్తులకు మాత్రమే దీన్ని అమలు అయ్యేలా చూడాలని కోరుతోంది. ఇదే విషయాన్ని ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు వచ్చే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment