జీఎస్టీ అమలుకు మేం రెడీనే!
తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం పార్లమెంటు ఆమోదం పొందిన పక్షంలో సత్వరం అమలు చేసే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ చెప్పారు. కొద్ది నెలలుగా ఉద్యోగులు ఇందుకు సంబంధించిన శిక్షణ పొందుతున్నట్లుగా ఆయన వివరించారు. మోడల్ జీఎస్‌టీ చట్టంపై సోమవారమిక్కడ జరిగిన తొలి చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శర్మ ఈ విషయాలు చెప్పారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల సమాఖ్య (ఎఫ్‌టీఏపీసీసీ).. కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (సీబీఈసీ) హైదరాబాద్ జోన్ దీన్ని సంయుక్తంగా నిర్వహించాయి. జీఎస్‌టీ బిల్లు ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ఆమోదం పొందగలదని ఆశిస్తున్నట్లు సీబీఈసీ ప్రత్యేక కార్యదర్శి రామ్ తీరథ్ పేర్కొన్నారు. వచ్చే నెలన్నర కాలంలో మిగతా ప్రాంతాల్లోనూ చర్చాకార్యక్రమాలు నిర్వహించి పరిశ్రమవర్గాల అభిప్రాయాలు తీసుకోనున్నట్లు తెలి పారు. తెలంగాణ రెవెన్యూ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా, సీబీఈసీ హైదరాబాద్ వైజాగ్ జోన్ చీఫ్ కమిషనర్ ఆర్ శకుంతల తదితరులు ఇందులో పాల్గొన్నారు.