జీఎస్‌టీ నీడన తగ్గనున్న పసిడికాంతి!
♦ రానున్న కొద్దికాలంపై డబ్ల్యూజీసీ నివేదిక
♦ ఈ ఏడాది డిమాండ్ 750 టన్నులు
♦ ఐదేళ్ల సగటు 846 టన్నులకన్నా తక్కువ!
న్యూఢిల్లీ: భారత్‌లో ఈ నెలారంభం నుంచీ అమల్లోకి వచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)వల్ల స్వల్పకాలంలో బంగారానికి డిమాండ్ తగ్గుతుందని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో తెలిపింది. 1.5 శాతంగా ఉన్న పసిడిపై రేటు జీఎస్‌టీ అనంతరం 3 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్ల్యూజీసీ తాజా నివేదికను చూస్తే...
⇔ దీర్ఘకాలంలో మాత్రం పుత్తడి పరిశ్రమపై జీఎస్‌టీ సానుకూల ప్రభావం చూపే వీలుంది. పారదర్శకత పెరగడం, సరఫరా సమస్యలు తొలగిపోవడం వంటి అంశాలు ఇందుకు దోహదపడేవిగా అంచనావేసింది.
⇔ అయితే స్వల్పకాలానికి చూస్తే– ఇప్పటికే ఏడు వారాల కనిష్ట స్థాయిలో ట్రేడవుతున్న పసిడి ధరలపై జీఎస్‌టీ మరింత ఒత్తిడిని పెంచే వీలుంది.
⇔ జీఎస్‌టీతో చిన్న వృత్తి నిపుణులు, రిటైలర్లపై వివిధ స్థాయిల్లో పన్ను భారం పడే వీలుంది.
⇔ రెండు లక్షల రూపాయలపైన నగదు లావాదేవీలపై ప్రభుత్వ ఆంక్షలు గ్రామీణ ప్రాంతాల్లో పసిడి డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ అంశాలు డిమాండ్‌ను తగ్గించడంతోపాటు బ్లాక్‌మార్కెటింగ్‌కు దారితీయవచ్చు.
⇔ ప్రపంచంలో పసిడి కొనుగోళ్ల విషయంలో రెండవ అతిపెద్ద దేశంగా ఉన్న భారత్‌లో ఈ ఏడాది పసిడి డిమాండ్ 650 నుంచి 750 టన్నుల శ్రేణిలో ఉండే వీలుంది. ఇది గడచిన ఐదు సంవత్సరాల్లో సగటు 846 టన్నుల కన్నా తక్కువ.
⇔ ఆసియా టైగర్లుగా పిలవబడే నాలుగు దేశాలు– హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్‌లు 1980–1990 మధ్య భారీ వృద్ధిని సాధించాయి. ఇందుకు ప్రధాన కారణాల్లో ఆ దేశాల యువత ఒక పటిష్ట కార్మిక శక్తిగా అవతరించడం ఒకటి. ప్రస్తుతం భారత్ వృద్ధికి ఇదే అంశం ప్రధాన మద్దతుగా నిలుస్తున్న అవకాశాలు కనిపిస్తున్నాయి.