
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థను సంఘటితం, ఏకీకృతం చేయాలన్న ప్రధాన లక్ష్యంతో అమల్లోకి తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఆ దిశలో ఇప్పటివరకూ విఫలమయ్యిందని బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ– హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది. అలాగే ఒకే దేశం – ఒకే పన్ను వ్యవస్థలో నగదుకు డిమాండ్ తగ్గకపోగా పెరిగిందని హెచ్‌ఎస్‌బీసీ నివేదిక తెలిపింది. అయితే దీర్ఘకాలంలో జీఎస్‌టీ వల్ల తగిన ఫలితాలు ఒనగూడుతాయన్న విశ్వాసాన్ని నివేదిక వ్యక్తం చేసింది. 2017 జూలై 1 నుంచీ పరోక్ష పన్నులన్నింటినీ ఒకటిగా చేస్తూ, జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
వేర్‌హౌసింగ్ రంగానికి జోష్!!
జీఎస్‌టీ అమలు కారణంగా దేశీ వేర్‌హౌసింగ్ రంగంలో 2018–2020 మధ్యకాలంలో 20 శాతం వార్షిక వృద్ధి నమోదు కావొచ్చని రియల్టీ కన్సల్టెంట్ జేఎల్‌ఎల్ అంచనా వేసింది. హబ్ అండ్ స్పోక్ మోడల్ సహా మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ (ఎంఎంఎల్‌పీ) వృద్ధిలో జీఎస్‌టీ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొంది.
‘‘ఆధునిక సాంకేతికత, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుదల, పాలసీల ఆవిష్కరణ రూపంలో ప్రభుత్వ మద్దతు వంటివి సానుకూల పరిస్థితులకు దారితీశాయి. భారత్ ప్రారంభ దశలోనే అభివృద్ధి చెందడానికి అవసరమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ అంశాన్ని భారత్ గ్లోబల్ ర్యాంకింగ్స్ పురోగతిలోనూ గమనించొచ్చు’’ అని వివరించింది. వచ్చే కొన్నేళ్లలో దాదాపు 25 కొత్త ఎంఎంఎల్‌పీలు ఏర్పాటు కావొచ్చని పేర్కొంది.
2021 చివరి నాటికి భారత్‌లో వేర్‌హౌసింగ్ 112 శాతం మేర వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. సంస్థలు భిన్నమైన డిస్ట్రిబ్యూషన్ మోడళ్ల కోసం అన్వేషిస్తాయని తెలిపింది. జీఎస్‌టీ తర్వాత కంపెనీలు చిన్న వేర్‌హౌస్‌ల ద్వారా పన్ను ఆదా అంశంపై కాకుండా సామర్థ్యంపై దృష్టి కేంద్రీకరిస్తాయని పేర్కొంది. వేర్‌హౌసింగ్ డెవలపర్లు పెద్ద పెద్ద లాజిస్టిక్స్ పార్క్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారని, అలాగే వ్యూహాత్మక ప్రాంతాల్లో భూముల కొనుగోలు చేస్తారని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment